భిన్నత్వంలో ఏకత్వమే దేశ గొప్పతనం : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల అన్నారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎన్నో కులాలు, మతాలు , భాషలతో దేశం విలసిల్లుతున్నదని తెలిపారు. ఇదే భారత దేశ సంపదని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. విభజించు పాలించు నీతిని అది అనుసరిస్తున్నదని తెలిపారు. మణిపూర్‌ లో జరిగిన ఘటనలు భరతమాతకే అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ శాంత్రి భద్రతలను నెలల తరబడి కాపాడాల్సిన వ్యవస్థ పనిచేయటం లేదని పేర్కొన్నారు. అక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. 60 వేల మంది నిర్వాసితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 222 చర్చిలను ధ్వంసం చేశారనీ, మహిళలపై లైంగిక దాడులు జరిగాయనీ, ఇద్దరు మహిళలను నగంగా పరేడ్‌ చేశారని గుర్తు చేశారు. ఇది దేశం అవమానంతో తలదించుకునే సందర్భం కాదా? అని ప్రశ్నించారు. మతం పేరుతో కేంద్రం రాజకీయాలు చేయడం మానేసుకోవాలని హితవు పలికారు. మతాల పేరుతో ప్రజల మధ్య మంటలు పెట్టి, వాటితో చలి కాచుకోవడం బీజేపీకిి అలవాటుగా మారిందని ఆరోపించారు.