పుట్టిన బిడ్డ నవ్వు పువ్వులా ప్రశాంతంగా ఉంటుంది. రంగురంగుల పూలు… తీరొక్క పూలు… ఎన్నో పేర్లు… ఎన్నెన్నో రకాలు. ప్రతి పువ్వు ఎన్నో అందాలను తన రెక్కల్లో దాచుకొని పరిమళాలను ఇస్తుంది. అందమైన పూలు లోకాల్ని అందంగా తీర్చడమే కాదు ఇంటి అలంకరణలో, ఫంక్షన్స్‌లో, పెండ్లి నుండి మనిషి జీవన యాత్ర కడవరకు తోడుగా అలంకారమై నిలుస్తాయి. ఎంతో అద్భుతంగా నిలిచే ఆ పువ్వులు నిశ్శబ్దంగా ఎండిపోవడమా! పనికిరాని చెత్తలో చేరడమా! అట్టి పూలకు తిరిగి జీవితం! ఎంత గొప్ప ఆలోచన! ఆ ఆలోచన ఓ వ్యాపారానికి మూలమైతే నిజంగా ఓ మంచి ప్రక్రియ. అలాంటి వినూత్న ఆలోచనే చేసింది మాయా వివేక్. ఆ వివరాలేంటో ఈ రోజు మానవిలో తెలుసుకుందాం…
సమాజం బాగుండాలి అంటే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఎన్ని వేల అడుగులకైనా మొదటి అడిగే మూలమన్నట్టు గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న ఆలోచనలతోనే మొదలవుతాయి. ఓ మంచి ఆలోచన ఆశయంగా మారి ఆచరణ రూపం దాల్చి లక్ష్యం సాధించబడుతుంది. అయితే ఆ ఆలోచన వ్యాపారానికి మూలమైతే సర్వదా సఫలీకృతమే. ఈరోజుల్లో రీసైకిల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేయడం చూస్తున్నాం. ఆ పరంపరలో ప్రకృతిలో విరబూసిన పువ్వులు వాడిపోయిన తర్వాత వృధా కాకుండా తిరిగి మరో రూపంలోకి మార్చాలన్న ఆలోచనతో మాయా వివేక్ ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించారు.
వినూత్న ఆలోచనలతో…
కర్ణాటకలో సాధారణ కుటుంబంలో పుట్టారు మాయ. చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగారు. వారి ప్రోత్సాహంతోనే గుల్బర్గా యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్‌లో పీజీ పూర్తి చేశారు. తర్వాత కలకత్తాలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రాం, ఐఐఎం కాశీపూర్‌లో ఎంటర్ప్రైనర్ స్టడీస్ పూర్తి చేసిన చైతన్య వంతమైన యువతి. తన ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చే వరకు పట్టుదలతో శ్రమించే తత్వం ఆమె సొంతం. శ్రమను నమ్ముకున్న వ్యక్తి. ఏదైనా కొత్తగా ఆలోచించడం, సున్నితంగా స్వీకరించడం, ముఖ్యంగా నిత్య నూతన ఉత్సాహం, ఉత్తేజం కలిగి ఉండడం డైనమిక్ మహిళ మాయా వివేక్ ప్రత్యేకం.
ఆర్థిక స్వాలంబన అవసరం
చదువుకునే రోజుల్లో వ్యాపారం చేయాలనే ఆలోచన లేదు. పెండ్లి తర్వాత భర్త కుటుంబం నుండి ఆమెకు మంచి ప్రోత్సాహం దొరికింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, మహిళలకు ఆర్థిక స్వాలంబన అవసరమని ఆమె అక్కడే నేర్చుకున్నారు. ఆ ఆలోచనతోనే 2000 నుండి 2018 వరకు ఫ్రైట్ ఫార్వర్డ్ ప్రొఫెషనల్‌లో కొనసాగారు. ఈ సమయంలో భారతదేశంలోని ఎన్నో ముఖ్య పట్టణాలతో పరిచయం ఏర్పడింది. ఆ అనుభవంతో పాటు వ్యాపార దక్షత కూడా నేర్చుకున్నారు. ఆ అనుభవమే ఊర్వి సస్టైనబుల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి తోడ్పడింది. అది ఆమె 2019లో ప్రారంభించారు.
ఓ వీడియో చూసి
ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. అవే ఆమెను ఉన్నత స్థాయికి తీసుకెళతాయంటారు మాయ. కుటుంబ బాధ్యతల్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా స్వీకరించే స్త్రీ వ్యాపార రంగంలో ఉంటే ఆ వ్యాపారం చాలా హుందాగా ఉంటుందంటున్నారు. పూలను రీ సైక్లింగ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ సంస్థ యూటూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందంటున్నారు. మాయా వివేక్ పూల వృధాతో పరిమళాల ఉత్పాదనను చేయడం ఓ గొప్ప పనిగా భావించారు. తన స్నేహితురాలు మైనల్ దాల్మియాతో కలిసి గుడిలో నుండి బయట చెత్తలో పడవేయాల్సిన పూలను తెప్పించి రీసైక్లింగ్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలనే ఉద్దేశంతో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులంతా మహిళలే.
ప్రజలకు హాని కలిగించని…
కంపెనీకి వచ్చే పూలన్నీ హైదరాబాదులోని మాదాపూర్, జూబ్లీహిల్స్ మొదలైన ప్రాంతాల్లోని ఇంచుమించు 40 గుడుల నుండి తెప్పించుకుంటారు. అలా సేకరించి తీసుకొచ్చిన పూలతో అంగర్‌బత్తీలు, బ్యాంబు ఫ్రీ స్టిక్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, రసాయన రహిత సబ్బులు, పెంపుడు జంతువులకు, చెట్లకు, ప్రజలకు హానీ కలిగించని ఫ్లోర్ క్లీనర్స్, సాయిల్ మిక్స్ స్కిన్ సేప్ కలర్స్, గిఫ్ట్ బాక్స్‌లు తయారు చేస్తున్నారు. ఇవన్నీ ప్రాసెస్ ద్వారా తయారు చేయడం మరో విశేషం. ఈ ఉత్పత్తులన్నీ హైదరాబాద్‌లోనే తయారు చేస్తారు. అయితే సంస్థ ప్రారంభించిన కొత్తలోనే కోవిడ్ రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కాస్త కష్టంగా మారింది. అయినా ఆమె ఆశయం, ఆత్మవిశ్వాసం, తన చుట్టూ ఉన్నవారి ప్రోద్భలం ఆమెను దృఢంగా నిలబెట్టాయి. అయితే మన ఉత్పత్తి క్వాలిటీ ఉంటే, వినియోగ దారులతో మన అప్రోచ్ బాగుంటే, ఆన్లైన్ షాపింగ్‌లో కూడా వ్యాపారం అభివృద్ధి చేయవచ్చంటారు మాయ వివేక్.
స్టోర్స్ సంఖ్య పెంచేందుకు
పచ్చదనానికి, ప్రకృతికి హాని కలిగించకుండా, మహిళల భాగస్వామ్యంతో పూల వ్యర్థాలతో ఉత్పత్తులు తయారు చేయడం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వి హబ్‌తో కలిసి తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నారు. ఒక్క హైదరాబాదులోనే ఊర్వీకి 20 స్టోర్స్ ఉన్నాయి. అలాగే బెంగుళూరు, చెన్నైలో ఒక్కోస్టోర్ ఉంది. రానున్న రోజుల్లో స్టోర్స్ సంఖ్య పెంచాలని ఆలోచిస్తున్నారు. మాయా వివేక్ ఓ వ్యాపార వేత్తగా అనేక అవార్డులు కూడా పొందారు. ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ ఇండియా సస్టైనబులిటీ అవార్డు 2022 ,ఉమెన్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ద ఇయర్ 2021, గ్రాండ్ క్వీన్ లీడర్షిప్ అవార్డ్ 2020లో అందుకున్నారు. మహిళలకు వ్యాపారం సులభమైనది కాకపోవచ్చు. కానీ సాధించాలనే తపన, పట్టుదలతో పాటు వ్యాపార దక్షత ప్రదర్శిస్తే వారే నెంబర్ వన్ కావచ్చు. తమ వ్యాపారం ద్వారా ఆర్థికంగా బలపడటమే కాదు, ఎంతోమంది మహిళలకు ఉద్యోగాలు కల్పించవచ్చు అని నిరూపించిన మాయా వివేక్.
వృధా చేయకుండా
మన దేశంలో 18 నుండి 29 ఏండ్ల వయసు కలిగిన యువతుల్లో 3.5 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించడం నా బాధ్యతగా భావించాను. ఓ వ్యాపారం ప్రారంభించాను కాబట్టి నాకు చేతనైనంతలో మహిళలకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. మహిళలకు ఉపాధి దొరకడంతో పాటు ఫ్లోరి కల్చర్ ఓ పరిశ్రమగా మారిన తర్వాత పూల వ్యాపారం బాగా పెరిగింది. అయితే ఒక్క హైదరాబాద్ నగరంలోని గుడుల్లోనే సుమారు 1000 ఎంటీల పూలు వృధా అవుతున్నాయి. ఎంతో సహజంగా పూస్తున్న పూలు ప్రకృతి సిద్ధమే కాదు. కాలుష్యాన్ని తగ్గిస్తూ పరిమళాలను అందిస్తాయి. అలాంటి పూలు వాడిన తర్వాత వృధా చేయకుండా ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇలాంటి సంస్థ స్థాపించి మహిళలకు ఉపాధి కల్పిస్తూ, కొద్ది వరకైనా పర్యావరణాన్ని కాపాడుతున్నందుకు సంతోషంగా ఉంది.
– మాయా వివేక్
– డాక్టర్ బండారు సుజాత శేఖర్
9866426640