– కేజ్రీ ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణ , ఆర్డినెన్సును సమర్ధిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో సేవలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్ధించుకుంది. జీ-20 దేశాల సమూహానికి భారత్ అధ్యక్షత వహిస్తున్నందున రాజధానిలో పెద్ద ఎత్తున అనేక అంతర్జాతీయ కార్యక్రమాలు జరుగుతాయని, ఆ సందర్భంగా పరిపాలన స్తంభించకుండా చూడడానికి ఈ ఆర్డినెన్స్ అవసరమని తెలిపింది. అంతేకాదు… కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. విజిలెన్స్ శాఖ అధికారి కార్యాలయంలోని కీలకమైన పత్రాలను అపహరించారని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర హోం శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది.
‘ప్రస్తుతం రాజధానిలో అధికార యంత్రాంగం గందరగోళంలో ఉంది. అక్కడ పరిపాలన స్తంభించింది. ప్రజల స్థానిక అవసరాలను, దేశీయ అవసరాలను సమతూకం చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులలో దేశ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ప్రతిబింబించింది’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలియజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. ‘విజిలెన్స్ శాఖలో పని చేసే అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. ఆ శాఖకు చెందిన ప్రత్యేక కార్యదర్శి కార్యాలయంలో చొరబడి కొన్ని పైళ్లను చట్టవిరుద్ధంగా తీసుకుపోయారు. ఢిల్లీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులైన సీనియర్ మంత్రుల ప్రమేయం ఉన్న ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన ఫైల్‌ను తీసుకున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించిన ఖర్చుల ఫైల్‌ను కూడా ఎత్తికెళ్లారు. ఒక రాజకీయ పార్టీ కోసం ఢిల్లీ ప్రభుత్వం పెట్టిన ప్రకటనల ఖర్చుకు సంబంధించిన పత్రాలను కూడా అపహరించారు. ఫీడ్‌బ్యాక్ యూనిట్ పేరిట ఏర్పాటు చేసిన ఓ యూనిట్ పనితీరుకు సంబంధించిన ఫైలు కూడా కన్పించడం లేదు’ అని ఆరోపించింది.
కాగా ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ ప్రభుత్వ అధీనంలో ఉన్న సేవలపై పెత్తనం చెలాయించేందుకు కేంద్రం ఈ ఆర్డినెన్సును తీసుకొచ్చిందని అంటూ దీనిని అనుమతించాలా అని ప్రశ్నించింది.