త్వరలో విజయా ఐస్‌ క్రీంలు

ఉత్సాహంగా…ఉల్లాసంగా
ఐస్‌క్రీం టేస్టింగ్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్కెట్‌లోకి త్వరలో విజయ డైరీ ఐస్‌క్రీంలను తీసుకు రానున్నట్టు విజయా డైరీ చైర్మెన్‌ సోమ భరత్‌ కుమారు తెలిపారు. విజయ డైరీ, హైబిజ్‌ టీవీ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ సమీపంలో నిర్వహించిన ‘2వ ఎడిషన్‌ ది గ్రేట్‌ ఇండియన్‌ ఐస్‌ క్రీం టేస్టింగ్‌ ఛాలెంజ్‌’లో కార్యక్రమంలో వెయ్యి మందికిపైగా పాల్గొని రకరకాల ఐస్‌క్రీంలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టేస్టింగ్‌ పోటీల్లో విజేతలకు సోమ భరత్‌ కుమార్‌ బహుమతులను అందజేశారు. ఇది కుటుంబ సమేతంగా నిర్వహించిన కమ్యూనిటీ ఈవెంట్‌ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 20కు పైగా ప్రముఖ ఐస్‌ క్రీం స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు రకరకాల వంటకాల రుచులను అందించాయి. అనేక కుటుంబాలు, సభ్యులు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. ఈ కార్యక్రమానికి విజయా డైరీ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించగా, హాస్పిటాలిటీ పాట్నర్‌గా మెర్క్యూర్‌ హౌటల్‌, హైదరాబాద్‌ కేసీపీ తదితర సంస్థలు సహకరించాయి. ఈ కార్యక్రమం తమకు మరిచిపోలేని అనుభూతిని అందించిందని ఈ సందర్భంగా పలువురు ఐస్‌క్రీం ప్రియులు హర్షం వ్యక్తం చేశారు. పోటీలో ఎల్బీ నగర్‌కు చెందిన భవానీ మొదటి బహుమతి (రూ.ఒక లక్ష, రూ.40 వేల హాలిడే ప్యాకేజీ), కొండాపూర్‌కు చెందిన సల్మా మొహమ్మద్‌ ద్వితీయ బహుమతి (రూ.50 వేలు నగదు, 25 వేల డొమెస్టిక్‌ హాలిడే ప్యాకేజీ), ఉప్పల్‌కు చెందిన దుర్గా ప్రసాద్‌ రెడ్డి (రూ.25 వేలు, రూ.10 వేల డొమెస్టిక్‌ హాలిడే ప్యాకేజీ)ని గెలుచుకున్నారు. కండ్లకు గంతలు కట్టుకుని ఎక్కువ ఐస్‌ క్రీంలను టేస్ట్‌ చేసి గుర్తుపట్టినందుకుగాను వీరు ఈ బహుమతులను అందుకున్నారు.