మతతత్వ అజెండా… యూసీసీపై విజయన్‌

తిరువనంతపురం : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యతిరేకించారు. దానిని మతతత్వ అజెండాగా అభివర్ణించారు. దేశంలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతోనే ఒకే దేశం-ఒకే సంస్కృతి అనే మతతత్వ అజెండాను అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. యూసీసీపై ఆకస్మికంగా చర్చకు తెర లేపడం బీజేపీ ఎన్నికల అజెండాలో భాగమేనని ఆయన తెలిపారు. యూసీసీని అమలు చేయడానికి బదులు పర్సనల్‌ లాలో వివక్షాపూరితమైన అంశాలను సవరించేందుకు, సంస్కరించేందుకు కృషి చేయాలని ఆయన కేంద్రానికి హితవు పలికారు. దేశ బహుళత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రతిఘటించాలని ప్రజలకు విజయన్‌ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక సంప్రదింపుల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.