– 5కే రన్‌లో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటేయడం హక్కు మాత్రమే కాదని, బాధ్యత కూడా, యువత ముందంజలో ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం హైటెక్స్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ద్వారా ఆధారితమైన ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 12వ ఎడిషన్ 5కే రన్ నిర్వహించారు. ఈ రన్‌ను సంయుక్తంగా జెండా ఊపి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, ఎన్‌ఎండీసీ చైర్మెన్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్‌సీ హెడ్ అమిత్ సిన్హా, ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2023 డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా, ప్రారంభించారు.ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయని అన్నారు. నగరంలోని యువకులు, శక్తివంతమైన పౌరులతో కనెక్ట్ కావడానికి ఇంతకంటే మెరుగైన మార్గం ఏముంటుందన్నారు. యువత అర్బన్ ఎనర్జీ గ్రోత్ ఇంజన్ అన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, బయటకెళ్లి ఓటెయడం మీ బాధ్యత కూడా అని సూచించారు. ‘ఎన్నికలు, ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనండి. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం అయ్యేలా ఇతరులను ప్రేరేపించండి. గ్రామీణ, పట్టణ ఓటంగ్ శాతంలో భారీ అంతరం ఉంది. మనం దీన్ని మార్చాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలు. మీరు ఓటెయ్యండి..ఇతరులతో వేయించండి’ అని పిలుపునిచ్చారు.