తెలంగాణలోనూ వార్‌ మెమోరియల్‌ పార్కు

– కొరియన్‌ వార్‌ మెమోరియల్‌ను పరిశీలించిన మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో కొరియన్‌ వార్‌లో త్రివిధ దళాలు వాడిన వార్‌ మెమోరియల్‌ను రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పరిశీలింఛారు. యుద్ధం పట్ల నేటి యువతలో అవగాహన, ఆసక్తి, నాలెడ్జి, దేశభక్తిని పెంపొందించడానికి కొరియా తరహాలో భారత ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ వారి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వార్‌ మెమోరియల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పిస్తామని మంత్రులు వెల్లడించారు. పర్యాటక రంగాన్ని అధ్యయనం చేయడానికెళ్లిన మంత్రుల బృందం సియోల్‌ నగరంలో కొరియన్‌ వార్‌లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, సబ్‌మెరైన్లు, త్రివిధ దళాలకు చెందిన ఆయుధాలతో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ, అధికారులతో సంప్రదించి భారత దేశ త్రివిధ దళాలు గత యుద్ధాలలో ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మెరైన్‌లతోపాటు యుద్ధంలో వాడిన ఆయుధాలను వారి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద వార్‌ మెమోరియల్‌ పార్కును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు.
ఈ పర్యటనలో పర్యాటక శాఖ ఎండి మనోహర్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌లు పాల్గొన్నారు .