సాగరం ఒడిలో ఆడుకున్న
బాల్య స్మృతులు
నా మదిలో ఇంకా చెరగనేలేదు
చెలియలి కట్టతో
చేసిన చెలిమి తో
ఇసుకలో కట్టుకున్న
నా బొమ్మరిల్లును
జలనిధి ఎన్ని సార్లు
ఎత్తుకెళ్ళి దాచేసిందో కదా
అడుగులో అడుగు వేసుకుంటూ
నా వెనకాలే వచ్చి
నా పాదముద్రలు
ఎన్నిసార్లు మాయం చేసి
దాగుడు మూతలు
ఆడుతుందో కదా
మనసులోని ఊసులు
కడలితో పంచుకోవాలని
తీరాన్ని చేరగానే
ఆప్యాయంగా
స్నేహ కెరటం అందిస్తుంది
సంద్రం అలల సవ్వడితో
నా పాదాలను స్పర్శిస్తూ
నాకు ధైర్య వచనాలు బోధించాలని
ఎగిసెగిసి పడుతుంది
నాలాగే జలధి కూడా
లోలోన ఎంతటి బడబాగ్నులు ఉన్నా
పైకి మాత్రం చిరుచిరు
నవ్వుల నురగలు చిందిస్తుంది
ఎంత కన్నీరు మున్నీరు అయిందో
అందుకేనేమో అపుడపుడూ
ఉప్పెనలా ఉప్పొంగి పోతుంది
తన గుండె లోతుల్లోని
సుడి గుండంలా
నా బాధలు సుళ్ళు తిరుగుతున్నా
ఆటు పోట్ల అలజడికి
తట్టుకుని నిలబడమని
సంభాషిస్తుంది
అంబుదిని పలకరిస్తే
అనంతమైన సందేశమిస్తుంది .!!
– ములుగు లక్ష్మీ మైథిలి