మేమేనండీ…

ఎలా పుట్టాలో తెలియకుండా పుట్టి
ఎలా బతకాలో తెలియకుండా
బతికే వాళ్ళం
బతకలేక చచ్చేవాళ్లం
హత్యాచారాలలో ఏ దేశమైతే
ముందు ఉంటుందో
అదే మా దేశం
ఇక ఊరు అంటారా!!
ఏ ఊర్లో ఉన్నా
ఐదు రోజులు బయట ఉండేవాళ్ళం
ఏ మతంలో పుట్టినా
ఆడవాళ్ళమే
ఏ కులంలో పుట్టినా
దళితులమే
ఎంత ముద్దుగా పుట్టినా
నాన్న ముఖం చిట్లించాల్సిందే
ఎన్ని నెలలు మోసినా
తల్లీ, కడుపు తీపి మరిచి
కుండీల పాలు చేయాల్సిందే
మాకు చదువు అవసరం లేదు
ప్రేమించే అధికారం లేదు
జీవించే హక్కు లేదు
సమానత్వం జాడే లేదు
ఎంత చదివినా
సంసారం చేయాల్సిందే అంటారు
ఎన్ని మెడల్స్‌ వచ్చినా
మెడలు వంచాల్సిందే అంటారు
మా జాతిని గౌరవిస్తామంటారు
మమ్మల్ని మాత్రం
మాడ్చి చంపేస్తుంటారు
ఆడదేవతల్ని
అనేక రూపాల్లో కొలుస్తూ ఉంటారు
అమ్మ, అక్క, చెల్లి
ఇలా మేము ఏ రూపంలో ఉన్నా
నామరూపాలు లేకుండా చేస్తారు
ఈ ప్రపంచానికి దిక్కే మేము
ఏ దిక్కు మొక్కు లేకుండా
పడి చచ్చేది కూడా
మేమే మేమే
బతుకు భారమైన
భారతమాతలం

– కీర్తి ఇనుగుర్తి