– కుంకుడు చెట్ల గుంపు గ్రామస్తులు
నవతెలంగాణ-మణుగూరు
మా సమస్యలను పరిష్కరించని ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కుంకుడు చెట్ల గుంపు గ్రామస్తులు తెలిపారు. సోమవారం గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కుంకుడు చెట్ల గుంపులోని సమస్యలు గత 18 ఏండ్లుగా జీవనాన్ని గడుపుతున్నామన్నారు. అటు మున్సిపాలిటీనా.. గ్రామపంచాయతీనా అనేది అర్థం కాకుండా, 2005 సంవత్సరం నుండి మున్సిపాలిటీ పరిపాలన కొనసాగుతుంద న్నారు. ఎన్నికలు నిర్వహించకుండా, ప్రజలకు గల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 నుంచి ఇప్పటివరకు అనేకమార్లు శాసనసభ లోక్ సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఎన్నికల నిర్వహిస్తున్నప్పటికీ, మున్సిపా లిటీలో ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఇది అధికారుల తప్పిదమా..? లేక ప్రజాప్రతినిధుల అసమర్థ పాలననా అని వారు ప్రశ్నించారు. పాలకవర్గం లేక మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేయికుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించుటలో ఉన్నటువంటి అవకాశాలనూ ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఉపాధి హామీ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వున్న భూమిని అమ్ముకొని పేదరికంలోనికి ముంచుతున్న మున్సిపాలిటీ వల్ల ఎవరికి లాభమని వారు ప్రశ్నిస్తూ, మున్సిపాలిటీలో 18 ఏండ్లుగా మా బాధలు బాధలు గానే ఉన్నాయని, మా సమస్యలు పరిష్కరించనందున రానున్న అసెంబ్లీ ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నామని హెచ్చరించారు. అధికారులు కూడా ఎన్నికల నిర్వహణ కోసం.. ఎలాంటి ఖర్చులు చేయకుండా ప్రజాధనం వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు మా పట్ల పూర్తి వివక్షతగా వున్నారని అన్నారు. శాసనసభ ఎన్నికల పట్ల వున్న శ్రద్ద…స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎందుకు లేదని, తాము ప్రస్తుత ఎన్నికల్లో పాల్గొనాలి అంటే శాసనసభ ఎన్నికలతో పాటు వారి గ్రామాన్ని గ్రామపంచాయతీగా మార్చి, స్థానిక సంస్థల పేరుతో ఎన్నికల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని గ్రామ పెద్ద గనేబోయిన ముత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలం శంకర్, పూనెం నాగరాజు, పాయం కార్తిక్, గనేబోయిన నాగేశ్వర్రావు, బోడయ్య, కోండ్రు బాయమ్మ, అక్కమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.