– మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన సంఘాల పేరిట వెలిసిన పోస్టర్లు
– మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఎందుకు జరపాలని సూటి ప్రశ్న
– ఆదివాసీల ఎదుగుదలకు మావోయిస్టులే అడ్డుకట్ట అని ఆరోపణ
నవతెలంగాణ-చర్ల
19వ ఆవిర్భావ దినోత్సవంను తీవ్రంగా ఖండిస్తున్నామని చర్ల బస్టాండ్ సెంటర్లో గిరిజన సంఘాల పేరిట వెలసిన పోస్టర్లు ఏజెన్సీలో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ 19వ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పోస్టర్లో గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. ఆ పోస్టర్లో ముఖ్యంగా మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల మీటింగ్లకు ఆదివాసీలమైన మేము ఎందుకు హాజరు కావాలి?, అసలు మావోయిస్టులు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఎందుకు జరుపుకోవాలి? నిరుపేదలమైన ఆదివాసీల అభివృద్ధి చెందకుండా మావోయిస్టు పార్టీ అడ్డుకుంటున్నందుకు జరుపుకోవాల… లేక మాకు కనీస సౌకర్యాలు అయిన విద్యా వైద్యం రోడ్డు కరెంటు అందనివ్వకుండా చేస్తున్నందుకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవాల అని ఆ పోస్టర్లలో ఆదివాసీ సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. మీ మావోయిస్టు పార్టీ వల్ల మా ఆదివాసీల బతుకులు ఏమి మారాయి..?, గత 20 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ వల్ల ఆదివాసీ ప్రజలకు ఒరిగిందేమిటి ఇంకాటంతకాలం మేము కాలినడక, సైకిల్లా మీద ప్రయాణం చేయాలి, రోడ్లు లేక వైద్యం చేయించుకోవడానికి వైద్యశాలకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? మా ఇళ్లకు కరెంటు లేకుండా ఇంకెంతకాల మేము చీకటిలో బతకాలి? మా ప్రాణాలు పోయినా మీ మావోయిస్టులకు మీ మావోయిస్టు పార్టీకి అవసరం లేదా, మా పిల్లల్ని బడికి ఎందుకు పంపవద్దు, మా ఊర్లకు రోడ్లు ఎందుకు వేయనీయవద్దు?, మా ఊర్లకు ఆసుపత్రులు ఎందుకు వద్దు? అని ఆ పోస్టర్లో మావోయిస్టులను గిరిజన సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. ఇకనైనా మా ఆదివాసీ గ్రామాలకు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని గిరిజన సంఘాల అ పోస్టర్లలో వేడుకున్నాయి.