– రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అదృశ్యమైన పిల్లలు, మహిళల్లో 87 శాతం మందిని కనిపెట్టి వారి సొంత గూటికి చేర్చటం జరిగిందని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్ వెల్లడించారు. ఇందులో 95 శాతం మంది మహిళలు ఎలాంటి వ్యవస్థీకృత నేరాల బారిన పడలేదని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా భద్రత విభాగం షీ టీమ్‌ల ద్వారా వందలాది మంది బాలబాలికలను, మహిళలను రక్షించటం జరిగిందని ఆమె తెలిపారు. ప్రధానంగా షీటీమ్స్ ఏర్పాటుతో మహిళలు భద్రతపరంగా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆచూకీ లభించిన 87 శాతం మంది పిల్లలు, మహిళలు మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి గురి కావటం, వేశ్య వృత్తికి లాగబడటం, ఇసుక బట్టీలలో అక్రమంగా పని చేయించటం, హౌటళ్లలో బాల కార్మికులుగా పని చేయటంతో పాటు ఇతర వ్యవస్థీకృత నేరాల బారిన పడలేదని ఆమె వివరించారు.
2021లో 86 శాతం మంది పిల్లలు, 87.5 శాతం మంది మహిళల మిస్సింగ్ కేసులను శోధించి వారిని సొంత గూటికి చేర్చటం జరిగిందని, 2022లో 81 శాతం పిల్లలను, 81 శాతం మహిళలను కనిపెట్టటం జరిగిందని ఆమె తెలిపారు. కాగా, మహిళలు అదృశ్యం కావటానికి గృహ హింసలు, అదనపు కట్నం కోసం వేధింపులు, మానసిక క్షోభలు వంటివి కారణం కాగా పిల్లలు కనిపించకుండా పోవటానికి విహార యాత్రల్లో తప్పిపోవటం, పరీక్షలల ఫెయిలైన కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోవటం, కొన్ని సందర్భాల్లో ఇండ్లలో తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైన స్థితిలో ఇంటి నుంచి వెళ్లిపోవటం వంటి కారణాలున్నాయని ఆమె తెలిపారు. కాగా, తప్పిపోయినవారిని గుర్తించటంలో ఫేషియల్ రికగ్నైషన్, దర్పణ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు. అలాగే, ఏడాదిలో ఆరేసి నెలల పాటు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు కూడా మిస్సింగ్ కేసులను ఛేదించటంలో ఎంతగానో దోహదపడుతున్నాయని ఆమె తెలిపారు. అదృశ్యమైన కేసులను ఛేదించటంలో జాతీయ స్థాయి సగటు పిల్లలకు సంబంధించి 60, మహిళలకు సంబంధించి 50 కాగా.. రాష్ట్రంలో అది 87 శాతానికి మించిందనీ, ఇది రాష్ట్ర పోలీసులు మిస్సింగ్ కేసులలో సాధించిన విజయానికి ఉదాహరణ అని షికాగోయెల్ తెలిపారు.