మనకు ఆహారం కావాలి-పొగాకు కాదు

ఏడాదికి 8 మిలియన్ల జనుల ప్రాణాలు పోతున్న వైనం పొగాకుతో వ్యాపించనున్న 21 వ్యాధులు
ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌
‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ’ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
‘మనకు ఆహారం కావాలి-పొగాకు కాదు’ అని నినాదంతో ప్రజలకు అవగహన కల్పిస్తున్నట్టు ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బుధవారం ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను టైమ్స్‌ సూపరింటెండెంట్‌ ఇషాన్‌ అహ్మద్‌ ఖాన్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988వ సంవత్సరం నుంచి పొగాకు వ్యతిరేక దినోత్సవం’ అనే నినాదంతో నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఏడాది ‘మనకు ఆహారం కావాలి-పొగాకు కాదు’ అని నినాదంతో ప్రజలకు అవగహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు రోజురోజుకూ పెరుగు తున్నారనీ దీంతో అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది దాదాపుగా ఎనిమిది మిలియన్ల జనులు ప్రాణాలు పోగొట్టు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నష్ట నివారణ కోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన కల్పించి, పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వలన ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్‌, గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, కంటి చూపు మందగించడం లాంటి 21 వ్యాధులు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయని’ తెలిపారు. ‘చుట్ట, బీడీ, సిగరెట్లు, కాల్చే వారికే కాకుండా ఆ పొగను పీల్చే వారికి కూడ ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయని వెల్లడించారు. ‘ప్రపంచ దేశాలలో పొగాకు పండించే దేశా లలో భారత్‌ రెండోవ స్థానంలో ఉందన్నారు. ఒక్క సిగరెట్‌ కాల్చడం వలన 12 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని, పొగాకు పండించడం వలన త్వరగా భూసారం తగ్గిపోవడం పాటు పర్యావరణపై ప్రభావం చూపి జీవ వైవిధ్యానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. ‘మానవులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా యువత అధికంగా ఉన్న మన దేశంలో పొగాకు, పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో నడుస్తూ విలువలతో కూడిన జీవన విధానాన్ని సాగి స్తున్నప్పుడే మన దేశం సంపూర్ణ ఆరోగ్య దేశంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ సిబ్బంది భాస్కరరావుతో పాటు ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు మారబోయిన సదానంద్‌ యాదవ్‌, జనార్ధన్‌, కె.బాలన్న,వాణి సాంబశివరావు, జిల్‌ మల్లేష్‌ పాల్గొన్నారు.