
మణిపూర్ లోయలో జరుగుతున్న అమానుష మారణహోమాన్ని నిరసించాలని, అక్కడ శాంతిని నెలకొల్పాలని నిజామాబాద్ లో మంగళవారం ప్రజా సంఘాలు ర్యాలీ, మానవహారం నిర్వహించాయి. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, ఆల్ పెన్సనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, వామపక్ష భావాలు గల విద్యార్థి, కార్మిక, మహిళా సంఘాలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. మనువాదం వద్దు – మానవ వాదం కావాలి, సేవ్ మణిపూర్ – సేవ్ ఇండియా వంటి నినాదాలతో వందమందికిపైగా ప్రజాస్వామ్యవాదులు ర్యాలీలో పాల్గొన్నారు. మునిసిపల్ కార్యాలయం ఎదురుగా మానవ హారాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ’ మణిపూర్ లో సంఘ్ పరివార్ కు చెందిన మెయితీ మూకల దౌర్జన్యకాండకు పోలీసులు సహకరించారని, అల్లరి మూకలు, పోలీసులు కలిసే కుకీ, నాగా, జో ఆదివాసుల మీద మారణాయుధాలు వాడారని, ఆదివాసీ స్త్రీల మీద అత్యాచారాలు, హత్యలు, చిత్రహింసలు, గ్రుహ దహనాలకు పాల్పడ్డారని ‘ విమర్శించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిజమైన వార్తలు బయటకు రాకుండా చూసాయన్నారు. ఇంత సిగ్గులేని, నీతి నియమాలు లేని, ఆధునిక నాగరిక మానవీయ పద్దతులు తెలియని పాలకులను, వ్యవస్థలను సహిస్తున్న, భరిస్తున్న మన సమాజం ఎంతగా పతనమై పోయిందో నని ఒక వృద్దుడు ఆవేదనను వ్యక్తం చేసాడు.