– కార్మికులకు కనీస సౌకర్యం సైతం కల్పించడం లేదు
– కాంగ్రెస్ నియోజకవర్గ నాయకురాలు శ్రీవాణి
నవ తెలంగాణ -పినపాక
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసం ధానం చేస్తాం అని కాంగ్రెస్ పినపాక నియోజకవర్గ నాయకురాలు శ్రీవాణి ఉపాధి హామీ కార్మికులకు హామీ ఇచ్చారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పాత రెడ్డిపాలెం, వెంకట్రావు పేట, చింతల బయ్యారం, జగ్గారం పరిధిలో వందరోజుల కూలీలకు మజ్జిగ, రాగి జావను ముందుగా అందజేశారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి ఆమె పని చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున కూలీలు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రవేశ పెట్టిన పథకం అని కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తుందన్నారు. కనీసం ఉపాధి కూలీల కోసం మంచినీటి సౌకర్యం కల్పించలేదని, ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అన్నారు. కనీసం టెంట్లు కూడా లేవని, ప్రమాదవశాత్తు ఏమన్న జరిగితే మెడికల్ కిట్లు కూడా లేవని ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూలీలకు కనీస రూ.400 రోజువారి కూలీ ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి బ్రదర్స్, గట్ల శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ, సత్యం, శారద, సంజీవరెడ్డి, వంక నరసింహారావు, (మాజీ సర్పంచ్) బత్తుల వెంకటేశ్వర రెడ్డి, రామారావు, సాంబ, వెంకటేశ్వర రెడ్డి (ఉపసర్పంచ్), వెంకట్ రెడ్డి, మారయ్య, పినపాక నియోజకవర్గం శ్రీవాణి అక్క సోషల్ మీడియా వారియర్స్, తదితరులు పాల్గొన్నారు.