ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం

– వంద రోజుల్లో తెరిపిస్తామని రైతులను మోసం చేశారు
– కోరుట్ల నియోజకవర్గ యాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ – మల్లాపూర్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని టీపీసీసీ చీఫ్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. జోడో యాత్రలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం పరిధిలో 10లక్షల ఎకరాల్లో చెరుకు సాగయ్యేదని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని అన్నారు. నిజామాబాద్‌ ఎంపీగా కొనసాగిన కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని చెప్పి.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉన్నదాన్నే మూసేశారని విమర్శించారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి చక్కెర కర్మాగారంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని సీఎంను ప్రశ్నించగా.. అది ముగిసిన అధ్యాయమని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. రైతుల ఆత్మగౌరమైన చక్కెర కర్మాగారం ముగిసిన అధ్యాయం అయితే.. కేసీఆర్‌ అధికారం కూడా ముగిసిన అధ్యాయమే అవుతుందన్నారు. మోడీ మెడలు వంచిన హర్యానా రైతుల స్ఫూర్తితో ఇక్కడి రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వారి పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మోడల్‌ పాలన అవసరమన్నారు. కాంగ్రెస్‌ పాలన.. బీఆర్‌ఎస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకులు జావిద్‌, జిల్లా అధ్యక్షుడు అల్లూరి లక్ష్మణ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నరసింగరావు, రాష్ట్ర నాయకులు కృష్ణారావు, కల్వకుంట్ల సుజిత్‌ రావు, కొమిరెడ్డి కరంచంద్‌, కాటిపెళ్లి శ్రీనివాస్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యనారాయణ రెడ్డి, ఎల్లాల జలపతి రెడ్డి, రైతు నాయకులు మామిడి నారాయణ రెడ్డి, బద్దం శ్రీనివాస్‌ రాజారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.