కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

– రూ.50 కోట్లతో ప్రేమ్‌ మగ్గాలు
– బీఆర్‌ఎస్‌దే కీరోల్‌
– చేనేత కార్మికులకు వచ్చే నెల నుంచే రూ.3000
– కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు
– రాబోయే ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలి : ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని.. అందులో మన పాత్ర తప్పకుండా ఉంటుందని ఐటీ పరిశ్రమల శాఖ జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో శనివారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కళాపూర్ణిమ సాయి భరత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. చేనేత కార్మికులతో మంత్రి ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ సందర్శన అనంతరం పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహావిష్కరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రసాయనాలుగా రంగరించి దేశానికి అద్భుతమైన నాగరికతను నేర్పించింది చేనేత కార్మికులని కొనియాడారు. అలాంటి నేతన్నల కోసం చేనేత మిత్ర పథకం త్రిప్టు కింద ప్రతి కార్మికునికీ నెలకు రూ.3000 ఇస్తామన్నారు. చేనేత మీద 5శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని నరేంద్రమోడీ అని విమర్శించారు. మోడీని సాగనంపినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఢిల్లీకి బానిసలు.. దద్దమ్మలు అని విమర్శించారు. ఢిల్లీలో కేసీఆర్‌ లాంటి దమ్మున్న నాయకుడు ఉండాలని, అప్పుడే దేశం బాగుంటుందని చెప్పారు. చేనేతకు 200 కోట్ల రుణాలు డీసీసీబీ టెస్కోప్‌ ద్వారా అందిస్తామని తెలిపారు. చేనేతలు తమ నివాసాల వద్ద గృహలక్ష్మి పథకం కింద షెడ్డు నిర్మించుకునేందుకు సాయం చేస్తామన్నారు. నేతన్నకు చేయూత ద్వారా 59 నుంచి 75 ఏండ్ల వయస్సు వరకు బీమా అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల బీమా కల్పిస్తామన్నారు. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. చేనేత కార్మికుల కోసం 50 కోట్ల రూపాయలతో ప్రేమ్‌ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం చేనేత అన్నారు. కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలంలో పద్మశాలీల కోసం ప్రత్యేక భవనం రూ.10 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. కార్మికుల కుటుంబానికి టెస్కో సహాయం రూ.5 వేల నుంచి 25 వేలకు పెంచుతామని తెలిపారు. నేతన్నల కోసం చేనేత హెల్త్‌ కార్డులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్డుల ద్వారా ఓపి నేతలకు రూ.25000 ఇస్తామని ప్రకటించారు.ఉప్పల్‌లో అద్భుతమైన హ్యాండ్లూమ్‌ మ్యూజియం నిర్మిస్తున్నామని తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కును ప్రభుత్వం రూ.1260 కోట్లతో కొనుగోలు చేసిందన్నారు. ఈ పార్కును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి దీని ద్వారా వచ్చిన లాభాలను చేనేత కార్మికులకు అందిస్తామన్నారు. రాబోయే ఎన్నికలలో పైళ్ల శేఖర్‌ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జెడ్పీ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఆనంద భాస్కర్‌, కలెక్టర్‌ వినరు కృష్ణారెడ్డి, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పీటీసీ కోట పుష్పలత, హ్యాండూమ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌్‌ చింత ప్రభాకర్‌, పవర్‌లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరు ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.