– ప్రభుత్వానికి టీఎమ్‌యూ జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్ర సాధనలో అనేక త్యాగాలు, నిర్బంధాలు ఎదుర్కొని సకల జనుల సమ్మెలో పాల్గొని ఉద్యమ దిశదశను మార్చిన ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వాలు ఏం చేశాయని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారంనాడాయన ఒక వీడియో సందేశం ఇచ్చారు. దానిలో గడచిన దశాబ్ద కాలంలో ఆర్టీసీ కార్మికులకు దక్కిందేమిటి? అని అడిగారు. ఉద్యమ సమయంలో ఇప్పటి పాలకులు అనేక ఆర్టీసీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారనీ, వాటిలో ఏ ఒక్కటీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడడం తాము చేసిన పాపమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణ చేసి, ఆర్టీసీ కార్మికులను ఇప్పటికీ విస్మరించారని చెప్పారు. పాలకులు ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలనీ, వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.