రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. ఇందులో రణ్‌బీర్ కపూర్‌కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణరు రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ నిర్వహించింది.
రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ,’తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ, ఆదరణ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. నా పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ ఉన్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. అలాగే ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో ఉంటాను. యానిమల్స్ అన్ ప్రెడిక్ట్బుల్‌గా ఉంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో ఉంటుంది. యానిమల్ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి’ అని తెలిపారు. ‘నా మొదటి చిత్రం ‘వంశవక్షం’ ది గ్రేట్ బాపు దర్శకత్వంలో చేశాను. నా ఫౌండేషన్ సౌత్ పరిశ్రమలోనే పడింది. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది. సందీప్ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను. ఈ కథని ఆయన అద్భుతంగా రాసుకున్నాడు. అందరూ ఇందులో ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారు’ అని అనిల్ కపూర్ అన్నారు.
రష్మిక మాట్లాడుతూ,’ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. సందీప్ ఈ కథను, పాత్రలను అద్భుతంగా మలిచారు. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ, ‘తండ్రి కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఈ కథ ప్రధాన సారాంశం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుంది. అయితే అది ఏ స్థాయిలో అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది’ అని చెప్పారు.