అణచివేత ఉన్న చోటే విప్లవాలు, తిరుగుబాటు

– సురవరం ప్రతాపరెడ్డి ధిక్కారానికి ప్రతీక:ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అణచివేత ఉన్నచోటే విప్లవాలు, తిరుగుబాటు వస్తాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో పీడితుల పక్షాన రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్‌, మావోయిస్టు పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. బషీర్‌బాగ్‌లోని టీయూడబ్ల్యూజే కార్యాలయాన్ని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం పున:ప్రారంభించారు. అనంతరం సురవరంప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సురవరం ప్రతాప్‌రెడ్డి ధిక్కారానికి ప్రతీక అని, నిజాంకు వ్యతిరేకంగానే మాత్రమే పనిచేయలేదని, ప్రజలకు అన్యాయం చేస్తేవారిపై పోరాడారని, మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పారని తెలిపారు. విద్యలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు. ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనొస్తే తమ ఆటలు సాగవని గమనించిన భూస్వామ్యవర్గాలు మంత్రి కాకుండా అణగదొక్కాయని గుర్తుచేశారు.
రాజకీయంలో కులపిచ్చి పెరిగిందని, జాతికోసం పోరాడిన చాకలి అయిలమ్మ, కొమురంభీం, అంబేద్కర్‌లను కులాలకు అంటగట్టి పరిమితం చేస్తున్నారని అన్నారు. రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. సమాజంలో మంచిగా చదివినా, మంచిగా దందా చేసుకున్న, రాజకీయంలో మంచి పలుకుబడి ఉన్నా ఓర్చుకోలేని పరిస్థితి ఉందని, గౌరవ మర్యాదలు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ శిలాఫలకాల్లో మంత్రి పేరుండదని, ఒక్కోసారి దు:ఖం వస్తుందని, బాధనిపిస్తోందని అసహనం వ్యక్తంచేశారు. జర్నలిస్టుల పరిస్థితి ‘బాహార్‌ శర్వానీ…అందర్‌ ఫరేషానీ’గా ఉంటుందని అన్నారు. ఉద్యోగుల తరహాల్లోనే జర్నలిస్టులకు సైతం హెల్త్‌కార్డులను రూపొందించే పని జరుగుతుందని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ భావప్రకటనకు స్వేచ్ఛకు ప్రతిరూపమని అన్నారు. భావజాలానికి, జ్ఞానసంపదకు విజ్ఞాన కేంద్రమన్నారు. ప్రజల కోసం రష్యాలో లెనిన్‌, చైనాలో మావో, భారతదేశంలో మహాత్మగాంధీ, తెలంగాణలో సురవరం పత్రికలను స్థాపించారని గుర్తుచేశారు.
నేటి సమాజంలో జర్నలిస్టుల పని కత్తిమీద సాములా ఉందని, పత్రికలు వ్యాపారకేంద్రాలుగా మారాయని తెలిపారు. జలియన్‌వాలాబాగ్‌ సంఘటన జరిగి 100ఏండ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటీషువారు క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుందని భావించామని, కానీ దేశభక్తికల్గిన బీజేపీ ప్రభుత్వం అలా చేయలేదని విమర్శించారు. సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ కె.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాప్‌రెడ్డి ఓ లెజెండ్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారులు డి.అమర్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు విరాహత్‌అలీ, శేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.