భద్రాచలంలో సైకిల్‌ పయనం ఎటు…?

– 2014లో 1400 ఓట్ల తేడాతో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
– పట్టణంలో బలమైన ఓటు బ్యాంకుతోపాటు సొసైటీ చైర్మెన్‌ పదవి కలిగి ఉన్న టీడీపీ
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు భద్రాచలంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ క్యాడర్‌ అధిక శాతం బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో బలహీన పడినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక బలమైన సామాజిక వర్గం ఇంకా పార్టీనే అంటిపెట్టుకొని ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పట్టణంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భద్రాచలం సొసైటీ చైర్మెన్‌గా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి అభినేని శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. 2014 సంవత్సరంలో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కొమరం పనిశ్వరమ్మ 50వేల పైచిలుకు ఓట్లు సాధించి కేవలం 1400 ఓట్ల తేడాతోనే ఓటమిపాలై రెండోవ స్థానంలో నిలిచారు. భద్రాచలం పట్టణానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం సర్పంచ్‌, ఉపసర్పంచులుగా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. తర్వాత కాలంలో మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళటంతో ఆ పార్టీ బలహీన పడినప్పటికీ 2018 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో పొదెం వీరయ్య గెలుపులో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. సంస్థాగతంగా భద్రాచల నియోజకవర్గంలో గెలుపు, ఓటములను శాసించే స్థాయిలో ఓట్లు ఉన్నట్టుగా ఆ పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ బాబు పర్యటన కూడా తెలుగు తమ్ముళ్లు శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్టుపై జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉండటంతో తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయంపై ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి భద్రాచలం పట్టణంతో పాటు వెంకటాపురం, వాజేడులో బలమైన ఓటు బ్యాంక్‌ కలిగి ఉండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం నియోజకవర్గం శాసనసభ ఎన్నికలలో గెలుపోవటములు పై ఆ పార్టీ తీసుకునే నిర్ణయ ప్రభావం స్పష్టంగా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణం తోనే ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు పై కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు బహిరంగంగానే బాబు అరెస్టును ఖండించి తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో పాటు ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్‌ రెడ్డి సైతం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత ప్రాధాన్యత గల నాయకుడు అవ్వడంతో ఆ పార్టీ కాంగ్రెస్‌ వైపే ముగ్గు చూపుతుందని చర్చ జోరుగా వినపడుతుంది.