కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెండ్లంటే నూరేళ్ళ పంట అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అర్థం చేసుకునేతత్వం తగ్గిపోతున్నది. దాంతో విడాకులు పెరిగిపోతున్నాయి. తన భర్తను బాగుచేసుకోవాలనే ఉద్దేశంతో ఓ భార్య చేసిన ప్రయత్నం విఫలమయింది. చివరకు ఆ సమస్య విడాకుల వరకు వెళ్ళింది. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్…
మీనకు 40 ఏండ్లు ఉంటాయి. ముగ్గురు పిల్లలు. భర్త రవి, ప్రభుత్వ ఉద్యోగి. కాకపోతే అతను నెలలో వారం రోజులు బయట వేరే, వేరే గ్రామాల్లో ఉండవల్సి వచ్చేది. అప్పుడప్పుడు తాగేవాడు. తను ఇంట్లో లేనప్పుడు భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని అతని అనుమానం. దాంతో ఆమెను ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధ పెట్టేవాడు. ఆమె అతని మాటలతో, ప్రవర్తనతో బాగా విసుగు చెందింది. నిజంగా తాను వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అప్పుడు రవికి తెలుసొస్తుందనుకుంది. ఎలాగైనా రవికి గుణపాఠం నేర్పించాలనుకుంది.
రవి స్నేహితుడు శేఖర్ ఆమెకు బాగా పరిచయం. దాంతో రవి ముందు అతనితో చాలా చనువుగా మాట్లాడేది. అది చూసిన రవి భరించలేక పోయాడు. భార్యను విపరీతంగా కొట్టడం మొదలు పెట్టాడు. ‘నాకూ శేఖర్‌కి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నన్ను, పిల్లలను పట్టించుకోకుండా నెలలో పది రోజులు బయట తిరుగుతున్నావు. అవసరం లేక పోయినా వేరే ఊరికి వెళతావు. అక్కడ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నావు. నాతో కనీసం ఒక్క మాట కూడా సరిగా మాట్లాడవు. కనీసం పిల్లల్ని కూడా ప్రేమతో దగ్గరకు తీసుకోవు. వేరే వాళ్ళతో మాత్రం గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతావు. పైగా నన్ను అనుమానిస్తూ పదే పదే మాటలతో హింసిస్తున్నావు. అందుకే నీకు నా పరిస్థితి అర్థం కావాలని శేఖర్‌తో చనువుగా ఉంటున్నట్లు నటించాను’ అని భర్తకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది.
కానీ రవి మాత్రం ఆమె మాటలు నమ్మలేదు. మరోవైపు శేఖర్ నిజంగానే మీనపై ప్రేమ పెంచుకున్నాడు. అతను మీనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చింది. ‘ఇప్పుడు నా జీవితం ఏంటో తెలియడం లేదు. నా ముగ్గురు పిల్లల భవిష్యత్ తలచుకుంటే భయంగా ఉంది. మీరే నాకు సలహా ఇవ్వాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మేము రవికి ఫోన్ చేసి పిలిపించాము. అతనితో మాట్లాడితే ‘నేను ఆమెతో ఉండలేను. నన్ను మోసం చేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అలాంటి ఆమెతో నేను ఎలా ఉండాలి’ అన్నాడు. ‘ఆమె నిజంగా అతనితో సంబంధం పెట్టుకోలేదని చెబుతుంది కదా! నువ్వు ఆఫీస్ పనిపై వెళుతున్నాని చెప్పి అక్కడ వేరే మహిళలతో సంబంధం పెట్టుకున్నావు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలోనే మీన అలా చేసింది. నీ భార్య మాటలు ఎందుకు నమ్మవు?’ అంటే, ‘అవును నాకు వేరే ఆవిడతో సంబంధం ఉంది. ఆమెకు పిల్లలు లేరు. నాతో పాటుగా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. నా ఉద్యోగ రీత్యా నేను వేరే ఊరికి వెళ్ళినా నాతో పాటు వస్తుంది. నాకు కావల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. కానీ మీనకు, పిల్లలకు నేను ఎలాంటి లోటూ చేయలేదు. వాళ్ళకు కావల్సిన వన్నీ ఏర్పాటు చేస్తూనే ఉన్నాను. ఆమె నన్ను మోసం చేసింది. మీనా తనది నటన అంటుంది కానీ శేఖర్ మాత్రం ప్రేమ అంటున్నాడు. నేనంటే మగాడిని ఎంత మందితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు. ఒక ఆడదై ఆమె ఎలా వేరే మగవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటుంది. అందుకే ఆమె నాకు వద్దు. ఆమెకు నేను విడాకులు ఇస్తాను. తర్వాత ఆమెకు నచ్చినట్లు ఉండమనండి’ అన్నాడు.
‘మగాడివైనంత మాత్రానా ఎంతమందితోనైనా సంబంధాలు పెట్టుకుంటానంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నీ భార్య నీపై కేసు పెడితే ఉద్యోగం ఊడిపోతుంది. అనవసరంగా లేని పోని సమస్యలు తెచ్చుకోవద్దు’ అని చెప్పాం. మేము ఎంత చెప్పినా అతను మీనతో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. కావాలంటే నష్టపరిహారం ఇస్తానన్నాడు.
శేఖర్‌ని పిలిపించి మాట్లాడితే ‘అవును మేడం మీన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. కానీ ఆమె మాత్రం నన్ను ప్రేమించడం లేదు. కేవలం రవికి తన బాధ తెలియజేయడం కోసమే తను అలా నాతో నటించింది. ముందు నేను కూడా అలాగే ఆలోచించాను. కానీ తర్వాత నాకు తెలియకుండానే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇందులో మీన తప్పు ఏమీ లేదు. రవి, మీన ఇద్దరూ కలిసి ఉంటే సంతోషించే వారిలో నేను మొదటి వాడిని. కానీ రవికి మీనతో ఉండడం ఇష్టం లేకపోతే మాత్రం నేను ఆమెను పెండ్లి చేసుకుంటాను’ అన్నాడు.
‘నా పిల్లల పరిస్థితి ఏమిటి? రవికి ఏదో గుణపాఠం నేర్పించాలని అనుకొని నేను చేసిన పనికి నా జీవితం ఇంత ఘోరంగా మారింది. ఇప్పుడు అటు వెళ్ళలేను, ఇటు రాలేను. రవి నాకు విడాకులు ఇస్తే నా పరిస్థితి ఏంటి’ అంటూ బోరున ఏడ్చింది. దానికి రవి ‘నా పిల్లలను నేను చూసుకుంటాను’ అన్నాడు. ‘మరి నేను ఎవరిని చూసుకుని బతకాలి, భర్త, పిల్లలు లేకుంటే నా పరిస్థితి ఏంటి’ అంటూ బాధపడింది.
‘నీ భర్తపై కోపంతో అతనికి బుద్ధి చెప్పాలని లేని పోని సమస్యలు తెచ్చుకు న్నావు. భర్తకు గుణపాఠం నేర్పాలంటే మరో దారి చూడాలి కాని, వేరే అతనితో సంబంధం ఉన్నట్టు నటించడం సరైనది కాదు. అసలే నీపై అతనికి అనుమానం. నిన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాడు. అలాంటి అతనికి ఇప్పుడు నువ్వే అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. నీ మాటలు అతను అస్సలు నమ్మడం లేదు. నీతో కలిసి ఉండలేనని కచ్చితంగా చెబుతున్నాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అలాంటి వ్యక్తితో నువ్వు ఉన్నా ఇబ్బందులు పడాల్సిందే. పిల్లల బాధ్యత అతనే చూసుకుంటా నంటున్నాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది. నీకు నష్టపరిహారం వచ్చేలా చూద్దాం. ఎలాగో శేఖర్ నిన్ను పెండ్లి చేసుకుంటానంటున్నాడు. మరి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకూ నచ్చితే పెండ్లి చేసుకో. లేదంటే విడిగా ఉండూ’ అని చెప్పాము.
దానికి మీన ‘నాకు కొంచెం టైం కావాలి మేడం, ఆలోచించుకొని చెబుతాను’ అంది. కొన్ని రోజుల తర్వాత ఆమె వచ్చి శేఖర్‌ని పెండ్లి చేసుకోనని చెప్పింది. రవి మాత్రం మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. మీన మాత్రం ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని చూసుకుంటుంది.
– వై. వరలక్ష్మి, 9948794051