రాబందుల రెక్కలు

మనిషి బ్రతకటం ఇవ్వాళ
మనిషిచేతిలో లేకుండా పోయింది!
బ్రతుకీడుస్తూ బతికేస్తున్న
బడుగు జీవుల ఉనికి
గంపగుత్తగా దోచుకుంటున్న
వాళ్ళ వేలికొసల విన్యాసాలకు
చిక్కి ఉక్కిరిబిక్కిరై పోతున్నది!
సగటు మనిషికి జీవించడమే
యుద్ధ క్రీడగా మారిన స్థితిలో
ప్రపంచాన యుద్దోన్మాధి మాత్రం
సహజ సామ్రాజ్యవాద కాంక్షతో
ఉూజుజ చమురు దేశాలపై పెత్తనానికి
జాతుల నడుమ చిచ్చు రగిలిస్తూ
మతాల మధ్య వైషమ్యాలు పెంచుతూ
దేశాల ముంగిట ద్వేషాలతో
రుద్దుతున్న విషజ్వాలల కుత్సిత యుద్ధాలకు
కాలి రాలిపడిపోతున్న
అమాయకపు జనాల
హాహాకారాలు యుద్ధవికృతాలే!
మారణాయుధాల దుష్ట బేహారి
చేస్తున్న ఆటవిక అమానుషాలే!
మొన్నటి మధ్య ఆసియాలో
ఇంకా చల్లారని నిన్నటి ఉక్రెయిన్లో
వందేళ్లుగా నడుస్తున్న నేటి
నరమేధపు గాజా భయానక
భీభత్స రణరంగ రక్త దాహానికి
సమిధాలౌతున్న పసిమొగ్గలు
పండుటాకులు ఆసుపత్రిలో రోగులు
ఇంటినీడ బిక్కపోయిన
తల్లుల శవాల గుట్టలు
సభ్యసమాజాన్ని మాపాపమేమిటి
అని నిలదీస్తున్నాయి!
ఇవ్వాళ పాలస్తీనా గాజానగర
భవన శిథిలాల నడుమ
తెగిపడిన దేహాలన్నీ
యుద్ధపిషాచి కోరలు తుంచకుంటే
రేపవి మనల్ని, ప్రపంచాన్ని
మట్టుబెట్టక మానవని
మానవాళిని హెచ్చరిస్తున్నాయి!
మాతృభూమిని దురాక్రమిస్తుంటే
ప్రాణాలు ఫణంగా ప్రతిఘటిస్తున్న
పాలస్తీనా శాంతి కపోతాలను
శవాల రుచిమరిగిన రాబందులు
ఇజ్రాయిల్‌ అమెరికా రూపంలో
వెంటాడి వేటాడుతుంటే…
జగాన జరిగే దురహంకార దాడులను
దోపిడీని చెండాడగ జనులంతా ఒక్కటై
స్వేచ్చ కోసం అస్తిత్వం కోరి
పిడికిళ్లు బిగించి విప్లవించటం నిజం!
WAR DOES NOT DETERMINE
WHO IS RIGHT- ONLY WHO IS
LEFT -Bertrand Russel
(పాలస్తీనా గాజాల పై సాగుతున్న ఇజ్రాయిల్‌ పాశవిక మారణ కాండను నిరసిస్తూ)
– డా||కె.దివాకరాచారి, 9391018972