విద్యుత్‌ సబ్సిడీలతో

– 72.41 లక్షల మందికి లబ్ది
– 27.48 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌
– ఐ అండ్‌ పీఆర్‌ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీల వల్ల 72.41 లక్షల మంది వినియోగదారులకు లబ్ది చేకూరుతున్నదని సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మార్గనిర్దేశంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌రంగం వెలుగులు జిమ్ముతున్నదని పేర్కొన్నారు. స్వరాష్ట్రం వచ్చాక ఇప్పటి వరకు గృహ, వ్యవసాయ రంగాలకు రూ.50 వేల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చినట్లు తెలిపారు. 27.48 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నదని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే విద్యుత్‌ కోతలను అధిగమించి అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందనీ, దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికతే ప్రధాన కారణమని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. 2014 లో 7,778 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదక సామర్ధ్యాన్ని, 2023 నాటికి 18567 మెగావాట్లకు పెంచగలిగారని చెప్పారు. ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.97,321 కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో అల్పాదాయ, బడుగు, బలహీనవర్గాలకు విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందనీ, నెలకు 0-50 యూనిట్స్‌ విద్యుత్‌ వినియోగించే గహ వినియోగదారులు 35 లక్షల 61 వేల 809 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. నెలకు 101 యూనిట్స్‌ లోపు విద్యుత్‌ వాడుతున్న షెడ్యుల్‌ కులాల వినియోగదారులు 1 లక్ష 25 వేల 433మంది ఉండగా, షెడ్యూల్డ్‌ తెగల వినియోగదారులు 2 లక్షల 95 వేల 114 మంది ప్రభుత్వ నిర్ణయంతో లబ్దిపొందుతున్నారని తెలిపారు.
నెలకు 250 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడుతున్న 6,494 మంది పౌల్ట్రీ ఫార్మ్‌ దారులు, 32,654 హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ల నిర్వాహకులు, 65,806 లాండ్రీ షాపుల వారు, 56 దోభి ఘాట్స్‌ లబ్దిదారులు విద్యుత్‌ సబ్సిడీ ప్రయోజనం పొందుతున్నారన్నారు. వీరితో పాటు 5,011 పవర్‌లూమ్‌లకు, 39 స్పిన్నింగ్‌ మిల్స్‌కు సబ్సిడీపై ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేస్తున్నదని వివరించారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ విద్యుత్‌తో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు లభించాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.