ఆర్థిక స్వాలంభనతోనే..

– మహిళలకు సుస్థిర జీవనోపాధి
– ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్‌
– మండల మహిళా సమాఖ్య 15వ సర్వసభ్య సమావేశం
– ప్రగతి నివేదిక ప్రవేశ పట్టిన ఏపీఎం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మహిళల ఆర్థిక స్వాలంభనతోనే సుస్థిర జీవనోపాధి పొందుతున్నారని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం మండల మహిళా సమాఖ్య 15వ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2022-2023 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌, ప్రగతి నివేదికను మండల సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి చదివి వినిపించారు. 2006 ఏప్రిల్‌ 20న మండల సమాఖ్య ఏర్పాటయ్యిందని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం 32 మండల సమాఖ్య సభ్యత్వం కలిగిన గ్రామ సంఘాలున్నాయన్నారు. 921 మండల సమాఖ్య సంఘాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. 9454 మంది సంఘ సభ్యులున్నారన్నారన్నారు. అంతే కాకుండా 25 వికలాంగుల సంఘాలలో 278 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. మండల మహిళ సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం రూ.74,54,784 సీఐఎఫ్‌ రుణాలను 8751 మంది లబ్ధిదారులకు రుణాలను అందజేసిందని వివరించారు. స్త్రీ నిధి ద్వారా రూ.4,79,97,000 ఇప్పించినట్లు వివరించారు. ఇప్పటి వరకు మండల మహిళా సమాఖ్య కార్పస్‌ రూ.1,75,28,058గా ఉన్నదని తన నివేదికలో పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ కృపేష్‌ మాట్లాడుతూ.. మండల మహిళా సమాఖ్య ప్రగతిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్‌ కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోని సుస్థిరమైన జీవనోపాధిని పొందాలన్నారు. మహిళలు గతంలో ఇంటి గడప దాటాలంటే భయపడే మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సుస్థిరమైన జీవనోపాధిని పొందాలన్నారు. గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థతను ఆశ్రయించకుండా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జైరాం విజరు, డీపీఎం స్వర్ణలత, నిర్మల, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు నిర్మల, కార్యదర్శి మహేశ్వరి, కోశాధికారి జ్యోతి, ఉపాధ్యక్షులు లక్ష్మి, ఎంవీఎస్‌ అధ్యక్షులు జంగయ్య, ఏపీఎం రవీందర్‌, స్త్రీనిది మేనేజర్‌ ప్రసాద్‌, సీబీఓ ఆడిటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.