బాలికను రక్షించబోయి.. విద్యుద్ఘాతంతో మహిళ మృతి

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
విద్యుద్ఘాతానికి గురైన బాలికను రక్షించబోయి ఓ మహిళ మృతి చెందిన విషాదకర ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ములికి బాపనమ్మ (32) తన భర్త ములికి శ్రీనుతో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌ అడ్డగుట్ట సొసైటీలోని వెస్టిన్‌ హిల్స్‌ కాలనీలో వీఆర్‌కే గ్రీన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తు న్నాడు. కాగా మంగళవారం ఉదయం సుమారు 10:30 గంటలకు బాపనమ్మ అపార్ట్‌మెంట్‌ ప్రధాన ద్వారం వద్ద నిలబడింది. అయితే అక్కడే శ్రీ లక్ష్మి అనే ఐదేండ్ల బాలిక ఆడుకుంటూ ఓ చెట్టును పట్టుకుంది. చెట్టుకు విద్యుత్‌ తీగలు తగిలి ఉండటంతో బాలిక విద్యుద్ఘాతానికి గురై అరిచింది. గమనించిన బాపనమ్మ ఆ బాలికను కాపాడేందుకు పరుగెత్తగా ఈ క్రమంలో ఆమె కూడా విద్యుద్ఘాతానికి గురైంది. అనంతరం ఆమెను ప్రతిమ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా విద్యుద్ఘాతానికి గురైన బాలిక గాయాలతో చికిత్స పొందుతోంది.