ఎరుకల జాతి భివృద్ధికి కృషి

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ-కల్చరల్‌
రానున్న కాలంలో ఎరుకల జాతి అభివృద్ధి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శనివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గతంలో పదేండ్లు పాలించిన పార్టీలు గిరిజనుల కోసం కేవలం రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 9 ఏండ్ల కాలంలో రూ.53 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. గిరిజన విద్యార్థులకు గురుకుల పాఠశాలలతోపాటు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2 లక్షల మంది గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారన్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను సీఎం కేసీఆర్‌ 10 శాతానికి పెంచడం వల్ల గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌ చొంగ్తు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రెటరీ శ్రీధర్‌, డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.శంకర్‌, రామచంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.