మధ్య ప్రదేశ్‌లో దారుణం

Worst in Madhya Pradesh– దళితుడి హత్య…అతని తల్లిని వివస్త్రను చేసిన దుండగులు
భోపాల్‌ : బిజెపి పాలనలో దళితులు, మైనార్టీలపై సాగుతున్న దమనకాండకు అంతులేకుండా పోతోంది. తాజాగా లైంగిక వేధింపుల కేసును ఉపసంహరిం చుకోవడానికి నిరాకరించిన ఒక దళిత యువతి సోదరుడిని హత్య చేయడంతో పాటు, ఆమె తల్లిని వివస్త్రను చేసిన అమానుష సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విక్రమ్‌సింగ్‌ ఠాకూర్‌ మరికొందరితో కలిసి ఒక దళిత యువతిపై 2019లో లైంగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై ఆ ఏడాదే కేసు నమోదైంది. అప్పటి నుండి కేసును ఉపసంహరించుకోవాలని దళిత కుటుంబంపై ఠాకూర్‌ ఒత్తిడి తీసుకువస్తున్నాడు. దీనికి ఎప్పటికప్పుడు దళిత యువతి కుటుంబం తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో రెచ్చిపోయిన ఠాకూర్‌ గురువారం బాధితురాలిపై ఇంటిపై దాడిచేశాడు. అడ్డుకున్న ఆమె సోదరుడు 18 ఏళ్ల నితిన్‌ అహిర్వార్‌ను చితకబాది చంపేశాడు. తల్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమెను వివస్త్రను చేశారు. మృతుడి సోదరి మాట్లాడుతూ పరారీలో వున్న కోమల్‌ సింగ్‌తో కలిసి విక్రమ్‌ సింగ్‌, అజాద్‌ సింగ్‌లు తన ఇంటికి వచ్చారని, కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని, అందుకు తిరస్కరించడంతో ఈ అమానుష కాండకు పాల్పడ్డారని చెప్పారు. దాంతో వెంటనే తాను సమీప అడవిలోకి పరుగెత్తి పోలీసుల సాయం కోరానని ఆమె వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన కోమల్‌ సింగ్‌తో సహా మరికొంతమంది పరారీలో వున్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై, ప్రధాన నిందితుడితో పాటూ అరెస్టు చేసిన మరో 8మందిపై హత్య కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బిఎస్‌పి చీఫ్‌ మాయావతి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.