అందంగా మలుచుకోండి

Wrap up nicelyఅంతా బావుంది అనిపించినంతసేపూ కొత్తగా ఏమీ ఆలోచించలేం. లైఫ్‌లోనూ కొత్తగా ఏ మార్పూ రాదు. కానీ ఉన్న దాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతో కాలం చేయలేం. ఏదో ఓ రోజున బోర్‌ అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్‌, ఓ మార్పు కావాలని అనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది లైఫ్‌లో సరికొత్త మార్పుకి శ్రీకారమే అని అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్‌ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలంటే…
జీవితంలో కొత్తగా ఇంకేమన్నా మార్పులు జరిగితే బావుండును అనిపించగానే చాలా మంది.. ఏముంది ఇంతే, ఈ లైఫ్‌ ఇలా గడవాల్సిందే వంటి నైరాశ్యంలో పడిపోతారు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేయొచ్చు అన్న విషయం కోసం ఆలోచిస్తారు. నిజానికి అందులో కొద్దిమంది మాత్రమే అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. తాము కోరుకున్న మార్పుని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. దాని నుంచి లభించే ఆనందాన్ని రుచి చూస్తారు. ఆ కొద్దిమందిలో మనం వున్నామా.. లేమా? అనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ లిస్ట్‌లో చేరాలంటే మనమేం చేయాలనేది నిపుణులు చెబుతున్నారు.
లైఫ్‌లో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడి నుంచో రాదు. అది మనలో రావాలని సూచిస్తున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయసు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహ పడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితే మీకు ఆనందాన్నిస్తుందని మీరు గాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తర్వాత దానిని అమలు చేయడమెలాగో చూడండి. ప్రయత్నించండి. గట్టి సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.
మీకు నచ్చిన ఓ కోర్స్‌ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్‌ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నమే అవుతుంది. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతప్తిని ఇంట్లో వారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు.