సీపీఐ(ఎం) ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా యర్రా శ్రీకాంత్‌

నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్‌
ఖమ్మం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థిగా యర్రా శ్రీకాంత్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆదివారం ప్రకటించింది.
పార్టీలో బాధ్యతలు : 1982-84 వరకు ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశారు. 1991 నుండి సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్త. 1995లో సీఐటీయూ ఖమ్మం పట్టణ కార్యదర్శిగా, 2002లో పార్టీ ఖమ్మం టౌన్‌ కార్యదర్శిగా, 2009లో పార్టీ ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2011లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికై నేటికీ కొనసాగుతున్నారు. 2019లో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులుగా మొదటిసారి తీసుకున్నారు. తిరిగి 2021 సం.లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నికైనారు.
ఉద్యమ నేపథ్యం : 14 సం.ల వయసులోనే ఉద్యమంలోకి రావడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో అసంఘటితరంగ కార్మికులు 1300 మందిని సమీకరించి దీర్ఘకాలిక పోరాటం చేయటంవల్ల పి.ఎఫ్‌లు, ఇతర సౌకర్యాలు సాదించటం జరిగింది. 2000 సం.లో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఖమ్మం గ్రైన్‌మార్కెట్‌లో కార్మికులను ఏకంచేయడంతోపాటు, వేతనాలు, ఇతర సమస్యలపై పోరాటాలు నిర్వహించి ఫలితాలు సాధించారు. పట్టణ ఇళ్ళ స్థలాల సమస్యపై 10 సం.లపాటు జరిగిన సుదీర్ఘపోరాటానికి నాయకత్వం వహించటం జరిగింది. పట్టణ పేదలకు వెంకటగిరి, కోటనారాయణపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు, ఇళ్ల సి.పి.ఎం. పోరాట ఫలితంగా వచ్చాయి. ఆ పోరాటాలన్నింటిలో శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 2007 భూపోరాటం, 2004లో ఖమ్మం ఎం.ఆర్‌.ఓ. కార్యాలయం ఎదురుగా జరిగిన 9 రోజుల ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు ఇండ్ల స్థలాల కోసం 5 రోజుల పాటు దీక్షలో పాల్గొన్నారు. విద్యుత్‌ పోరాటంలో 21 రోజులు జైలు జీవితం గడిపారు. గ్రైన్‌ మార్కెట్‌ తరలింపును వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలవారిని కలుపుకొని పోరాటాలు నిర్వహించడం ద్వారా మార్కెట్‌ తరలింపును తాత్కాలికంగా నిలుపుదలచేయడం జరిగింది. పట్టణంలో పార్టీ విస్తరణ, నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.