హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి

– ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు, ఆర్‌ఆర్‌ఆర్‌
–  జాతీయ రహదారులతో ఓఆర్‌ఆర్‌ అనుసంధానం : హైటెక్స్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో టీఎస్‌ఐఐసీ ఎమ్‌డీ నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘హైదరాబాద్‌ అన్ని రంగాల్లో చక్కగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌ మెట్రో రైలు ఏయిపోర్ట్‌ ప్రాజెక్టు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మన ఔటర్‌ రింగ్‌ రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంది. రెండు జాతీయ రహదారులు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి, నాగ్‌పూర్‌ నుంచి బెంగళూరు వరకు నగరం గుండా పోనున్నాయి. ఓఆర్‌ఆర్‌ పక్కన ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) కూడా వస్తుంది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతోపాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా వ్యవహరిస్తోంది’ టీఎస్‌ఐఐసీ ఎమ్‌డీ వెంకట నర్సింహ్మారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెషిన్‌ టూల్‌, ఇంజినీరింగ్‌ ఎక్స్‌పో(హిమ్‌టెక్స్‌2023)తో పాటు ఇండియా ప్రాసెస్‌ ఎక్స్‌పో, కాన్ఫరెన్స్‌(ఐపీఇసీ)ని నిర్వహిస్తోంది. ఈ జంట ప్రదర్శనలు ఆగస్టు 21 వరకు మూడు రోజుల పాటు కొనసాగను న్నాయి.వీటిని శుక్రవారం వెంకట నర్సింహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక ఆధిక్యత మరియు యంత్రాల తయారీ మరియు యంత్ర పరికరాల పరిశ్రమలో తాజా ఆవిష్కరణలు ప్రదర్శించబడు తున్నాయని అన్నారు. రెండు ఎక్స్‌పోల మధ్య 285 ఎగ్జిబిటర్లు 13 వేర్వేరు దేశాల నుంచి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు.
ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ చిప్లుంకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ వృద్ధిలో తాము భాగమని చెప్పారు. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌లో రూ.18,000 కోట్ల అతిపెద్ద పెట్టుబడి పెట్టింది అన్నారు. హైటెక్స్‌ బిజినెస్‌ హెడ్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ సాంకేతిక ఔన్నత్యం, మెషినరీ తయారీ, మెషిన్‌ టూల్‌ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు ప్రదర్శించబడుతున్నాయని తెలిపారు. స్మార్ట్‌ నగరాల మాదిరిగానే స్మార్ట్‌ వ్యక్తులు, యంత్రాలు, సాధనాలు కూడా స్మార్ట్‌, తెలివైనవిగా మారుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మెషిన్‌ టూల్‌ పరిశ్రమ తెలివిగా, మరింత సులభంగా నెట్‌వర్క్‌ చేయబడిన, లోపాల్లేని యంత్రాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్‌ఎంఈ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ఇంజనీర్స్‌(ఐఐపీఈ), ప్రాసెస్‌ ప్లాంట్‌ అండ్‌ మెషినరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీపీఎంఏఐ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీర్స్‌ (ఐఐసీహెచ్‌ఈ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ రోబో టిక్స్‌, ఆటోమేషన్‌(ఏఐసీఆర్‌ఏ), ఇండియా ఎలక్ట్రా నిక్స్‌ సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ (ఏఈఎస్‌ఏ), ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణా ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ(ఎఫ్‌టీసీసీఐ), ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్మాల్‌ ఇండిస్టీస్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఈటీఎస్‌ఐఏ) వంటి సంస్థలతోపాటు తయారీదారుల సంఘాలు, అసోసియేషన్‌లు ఎక్స్‌పోకు మద్దతునిస్తున్నాయి.