గులాబీ గూటికి  యువత

– అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
– ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో పార్టీలో చేరిన కథలపూర్ యువకులు
నవతెలంగాణ- వేములవాడ:
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యే గులాబీ గూటిలో చేరుతున్నామని, బీఆర్ఎస్ పార్టీతోనే, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని కథలపూర్ మండల కేంద్రానికి చెందిన రాయల్ రెడ్డీస్ యూత్ సభ్యులు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ఆకర్షితులై శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ బోయినిపల్లి వినోద్ కుమార్ సమక్షంలో, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవ రెడ్డి,  ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ఆధ్వర్యంలో రెడ్డి సంఘం యువకులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు, యువ రైతులు సుమారు 50మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వినోద్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో నూతనంగా చేరిన యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం శ్రమించాలని కోరారు. అనంతరం పలువురు యువకులు మాట్లాడుతూ 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తాము,  ఉద్యమ కాలంలో బడి పిల్లలుగా ఉన్నామని, ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో పాటు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని  గమనించుకుంటూ ఎదిగామని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి  ఆకర్షితులమై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించుకునే క్రమంలో బీఆర్ఎస్ కుటుంబంలో భాగస్వామ్యం కావాలని, అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  మంత్రి కేటీఆర్ నాయకత్వం లో విదేశీ పెట్టుబడులతో రాష్ర్టంలో  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరువుతున్నాయని, ఈ పరిణామం తమలాంటి యువకులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పార్టీలో నూతనంగా చేరిన తాము వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేస్తామని, వేములవాడ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.