యువత నిరంతరం పోరాటాలు సాగించాలి

– ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.తిరుమలై రామన్‌
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు కొనసాగించాలని ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.తిరుమలై రామన్‌ పిలుపునిచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఎన్‌.సత్యనారాయణరెడ్డి భవన్‌లో గురువారం ఏఐవైఎఫ్‌ రాష్ట్ర విస్తృత స్థాయి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.తిరుమలై రామన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి నిరుద్యోగుల భవిష్యత్‌పై చిత్తశుద్ధి లేదని, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించలేక పోయిందని ఆరోపించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చలేని ప్రభుత్వ పథకాలు అవసరం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను నిర్మించాలని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నిరంకుశ విధానాలపై యువత సంఘటిత ఉద్యమాల్లో పాల్గొనాలని, ఉపాధి కల్పించే వారికే రానున్న ఎన్నికల్లో ఓటు అనే నినాదంతో యువతను చైతన్యపర్చనున్నామని తెలిపారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఆఫీస్‌ బేరర్స్‌ నెర్లకంటి శ్రీకాంత్‌, కనుకుంట్ల శంకర్‌, లింగం రవి, వెంకటేశ్వర్లు, యుగంధర్‌, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, సత్యప్రసాద్‌, ఆర్‌.బాలకృష్ణ, బిజ్జ శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, కిషోర్‌, సల్మాన్‌, మహేష్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.