యువత ప్రపంచ పౌరులుగా ఆలోచించాలి

– పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు చంద్రబాబు పిలుపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లేందుకు యువత, ఇతర తరగతులు ప్రపంచ పౌరులుగా ఆలోచించాలనీ, ఆ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడి ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ)లోని అధ్యాపకులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో చంద్రబాబు నాయుడు యువత సాంకేతిక పరిజ్ఞాన ప్రదాతలుగా ఎదగాలని అభిప్రాయపడ్డారు. సైబరాబాద్‌ను ఎలా అభివద్ధి చేశారో, ఆర్థిక జిల్లాలో మౌలిక వసతులు కల్పించారో గుర్తుచేస్తూ పీ-4(పీపుల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌)ను ఇప్పుడు ప్రతిపాదిస్తు న్నట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాలు కానీ యావత్‌ జాతి అభివద్ధి కోసం దీన్ని మనం సాధించగలిగితే అది దేశానికి గొప్ప ఆస్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో కాల్స్‌ చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, అంతర్జాతీయ కాల్స్‌ కోసం వీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ఉండేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మెరుపు కాల్‌ చేస్తే ఎనిమిది గంటలు కాకపోయినా ఎనిమిది రోజులు పట్టేదని చంద్రబాబు గుర్తుచేశారు. ”నా విజన్‌-2020తో నేను సాంకేతికతను ఆధునీకరించడంలో విజయం సాధించాను , మీరందరూ ఇప్పుడు దాన్ని ఆస్వాదిస్తున్నారు, దీని కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ యూనిట్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడానికి బిల్‌ గేట్స్‌ను కలవడానికి తాను ఎలా కష్టపడ్డానో వివరంగా చెప్పిన మాజీ ముఖ్యమంత్రి, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఐఆర్‌డీఏ) పొందడానికి అప్పటి ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఒప్పించగలిగానని చెప్పారు. భారతదేశం నుంచి హైదరాబాద్‌కు వెళ్లడం వల్ల అక్కడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పడింది. గచ్చిబౌలిని అభివద్ధి చేయడం వెనుక ఉన్న కథను వివరిస్తూ ఇప్పుడు హైదరాబాద్‌ ప్రపంచ పటంలో ఉందని అన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయనీ, ఒకప్పుడు నగరాన్ని సెమీ అర్బన్‌ ప్రాంతంగా మాత్రమే పరిగణించేవారన్నారు. టీడీపీ ప్రభుత్వం రోడ్లను విస్తరించి, ఆ తర్వాత ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) రూపకల్పన కోసం పరిస్థితులతో పోరాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర ప్రాజెక్టులు పెట్టుబడిదారులను తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసుకునేలా ఒప్పించామని వివరించారు. తెలుగువారు ప్రపంచానికి నాయకత్వం వహించాలనేదే నా మొదటి ప్రధాన ప్రాధాన్యత అని చంద్రబాబు అన్నారు. ఇండియన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, నల్సార్‌ విశ్వవిద్యాలయం ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు ఇక్కడ ఉన్నాయని వివరించారు. దేశానికి , ప్రపంచానికి నాయకత్వం ఉందన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని నేను విశ్వసిస్తున్నానని వివరించారు. హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐఐఐటీ స్థాపన వెనుక తన మెదడు ఉందన్న మాజీ ముఖ్యమంత్రి, ఈ సంస్థ దేశంలోని టాప్‌ 10లో ఒకటిగా పరిగణించబడటం పట్ల సంతప్తి వ్యక్తం చేశారు.