– దక్కించుకునేందుకు నేతల పాట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సీటు కోసం నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగిస్తుండటంతో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కుతోంది. సీఎం కేసీఆర్ చేయించిన సర్వేల ప్రకారం… ప్రస్తుత ఎమ్మెల్యే మాణిక్‌రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అందువల్ల ఈసారి కేసీఆర్ ఆయనకు టిక్కెట్ నిరాకరించవచ్చని సమాచారం. మాణిక్‌రావుకు బదులుగా నరోత్తమ్ (మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్)కు ఆ స్థానాన్ని కేటాయించనున్నారని సమాచారం. దీంతో మాణిక్‌రావు అనుచరులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయమై సీఎం కేసీఆర్‌తోనూ, మంత్రి కేటీఆర్‌తోనూ మాణిక్‌రావు చర్చించారు. అయినా ఫలితం కనబడలేదని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మాణిక్‌రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతున్న కొందరు నేతలు.. నరోత్తమ్‌ను కూడా అంగీకరించటం లేదు. ముఖ్యంగా అక్కడి సీనియర్ నాయకుడు ఎమ్‌జీ రాములుతోపాటు మరికొందరు నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలంగాణ భవన్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు కూడా నరోత్తమ్‌ను వ్యతిరేకిస్తున్నాయని వినికిడి. ఈ క్రమంలో మధ్యేమార్గంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వసంత్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఉన్నత విద్యావంతుడు కావటం, రైతుల డిమాండ్లపై గతంలో ఢిల్లీ స్థాయిలో పాదయాత్ర నిర్వహించటం, 22 ఏండ్లుగా సామాజిక కార్యక్రమాలను నిర్వహించటంలాంటి అంశాలతో ఆయన సీఎం దృష్టిలో పడ్డారని బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ సీనియర్ వ్యాఖ్యానించారు. అయితే మాణిక్‌రావు, నరోత్తమ్, వసంత్… ఈ ముగ్గురిలో ఎవరి పేరును కేసీఆర్ ఖరారు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ తొలి జాబితాలో కూడా జహీరాబాద్ అభ్యర్థి పేరు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు మాత్రం తమ లీడర్‌కే టిక్కెట్ దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారు గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే తిష్టవేశారు.