ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు కాంగ్రెస్‌ ప్లీనరీ

– వేదిక కానున్న రాయపూర్‌…
– సీడబ్ల్యూసీ ఎన్నిక…ఆరు అంశాలపై చర్చ :
– కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వెల్లడి
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయని కాంగ్రెస్‌ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైరాం రమేష్‌తో కలిసి మాట్లాడారు. ఏఐసీసీ 85వ ప్లీనరీ ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజకీయాలు, ఆర్థికం, అంతర్జాతీయ వ్యవహారాలు, రైతులు, వ్యవసాయం, సామాజిక న్యాయం, సాధికారిత, యువకులకు ఉపాధి కల్పించడం, విద్యకు సంబంధించిన ఆరు అంశాలుపై చర్చ జరుగుతున్నదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్లీనరీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఎన్నుకుంటారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ సవరణలపై కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాహుల్‌ గాంధీ భద్రతపై కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా మౌనంగా ఉన్నారని విమర్శించారు. అత్యున్నత నిర్ణయాధికారం బాడీ( సీడబ్ల్యూసీ)లో పార్టీ అధ్యక్షుడితో సహా 25 మంది సభ్యులు ఉండగా.. పన్నెండు మందిని పార్టీ అధినేత నామినేట్‌ చేస్తారు. 12 మందిని ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటారు. అక్టోబర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే 47 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.