బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పైనా, 2002లో గుజరాత్‌ అల్లర్లపైనా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని దేశంలో నిషేధించడంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులతో ఇచ్చిన ట్వీట్లను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తరపున సీనియర్‌ న్యాయవాదులు ఎంఎల్‌ శర్మ, సియు సింగ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ తెలిపారు. ‘ఇండియా : ది మోడీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీని నిషేధించటం దురుద్దేశపూర్వకం, నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధం అని ఎంఎల్‌ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాము దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసర జాబితాలో చేర్చి విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. పౌరులు, విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని, అందుకే దయచేసి ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లపై వచ్చే నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు పౌరులకు ఉందో లేదోననే విషయాన్నీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయించాలని న్యాయవాది ఎంఎల్‌ శర్మ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జనవరి 21న ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. వీటిని పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 6న విచారణ చేపడతామని తెలిపింది.