ఫార్మసిస్ట్ గంగాధర్ ఆరోగ్యానికి 55 వేల ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట
అధిక రక్తపోటుతో ఆసుపత్రిలో చేరి వైద్యం పొందుతున్న ఫార్మసిస్ట్ గంగాధర్ ఆరోగ్యానికి వైద్య సిబ్బంది 55వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం మండల కేంద్రంలో ఫార్మసిస్ట్ వినోద్ మాట్లాడుతూ కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా విధులు నిర్వర్తిస్తున్న గంగాధర్ అధిక రక్తపోటుతో ఆసుపత్రిలో చేరడం జరిగిందన్నారు. గంగాధర్ ఆరోగ్య పరిస్థితిని జిల్లా వైద్య అధికారి డాక్టర్ అప్పయ్య దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి గంగాధర్ పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అదేవిధంగా తన వంతు గా ఆర్థిక సహాయాన్ని అందించారు. మన ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ క్యాడర్లలో ఉన్న ఉద్యోగులు కూడా స్పందించి వారికి తోచిన రీతిలో ఆర్థిక సహాయం అందించారు. మొత్తం 55 వేల రూపాయలు జమ కాగా గంగాధర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.