చుక్కల్లో చంద్రుడు మరింగంటి భట్టరాచార్యులు వారు

మరింగంటి భట్టరాచార్యులు వారు ఈ పేరు వింటే చాలు సాహితీ కళామతల్లులు ఆనందపారవస్యంలో మునిగి తేలుతారు. భారతమాత మువ్వన్నెల జెండా రెపరెపల్ని విశ్వవ్యాపితం చేస్తుంది. వీరి పద్య సౌందర్యానికి అబ్బురపడి చిలకమ్మ సైతం తన చిలక పలుకుల్ని పద్యాలతో బాణీకడుతుంది. ఇలా ప్రకృతిని, పంచభూతాల్ని పరవశింపజేస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్ని రంగాలలో ఓ ధ్రువతారలా విలిగిపోతున్న మరింగంటి భట్టరాచార్యులు గారు ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో 1930 సెప్టెంబర్ 28న రంగాచార్యులు, వీర రాఘవమ్మ పుణ్య దంపతుల ఇంట వరాల పుత్రునిగా జన్మించారు.
వీరి తండ్రి గారు కొద్ది సంవత్సరాలకి తిరువూరు వచ్చి స్థిరపడ్డారు. వీరు విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర శిష్యునిగా చేరి చదువు ప్రారంభించారు. వీరిని విశ్వనాథ వారు ‘ఆచారి’ అని ముద్దుగా పిలిచేవారు. ఓసారి విశ్వనాథ వారు దాశరధీ శతకంలోని పద్యాలు చదవమని అడిగారు. అడిగిందే తడవుగా పద్యాలు ఎంతో శ్రావ్యంగా చదివి వినిపించారు. చదువుతుంటే ఆ పద్యాలలోని దృశ్యాలన్నీ కళ్ళముందు కదలాడుతున్నట్లుగా ఉండేవి. ఆచార్యుల వారి కంఠ స్వరానికి మెచ్చి “నీవు నా దగ్గర ఉన్నంతకాలం పద్యాలు చదవాల్సిందే. నీవు చదువుతుంటే వీనుల విందుగా, వినసొంపుగా ఉందిరా” అంటూ తరచూ చదివించుకునేవారు విశ్వనాథ వారు. పేదరికం వల్ల ఫీజులు కట్టలేక ఒకే క్లాసు మళ్ళీ చదవాల్సి వచ్చింది. దాంతో స్కూల్ యజమాన్యం వీరిచేత స్కూలు బెల్లు కొట్టించడం, తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచినీరు తరగతి గదిలో పెట్టించడం లాంటివి చేయించేవారు. చిన్న తనం లోనే తండ్రి గారిని పోగొట్టుకోవడం వల్ల…పేదరికం వల్ల చదువుకు వీరామం వచ్చింది. వీరి పెద్ద అన్నగారు మరింగంటి సీతారామా చార్యులు గారు వీరి చదువుకు అండగా నిలిచారు గంటిసోమయజులు గారు కూడా భట్టారాచార్యుల వారి ముఖ్య గురువులు. ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డ తెలుగులో భాషా ప్రవీణ పూర్తి చేశారు. హిందీలో విశారద పట్టా పుచ్చుకున్నారు. అలాగే సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించారు. భట్టరాచార్యులవారు రంగనాయకమ్మ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు. పెద్ద కొడుకు డాక్టర్ మరింగంటి మురళీకృష్ణ గారు జర్నలిస్టుగా, సాహితీవేత్తగా ప్రముఖంగా భాసిల్లుతున్నారు. మరింగంటి వారు జీవన భృతి కోసం హిందీ భాష ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేసి విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించారు. ఒక్క చదువే కాకుండా పిల్లలకి వ్యవసాయం పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఆశక్తి కలిగేలా ఎన్నో విషయాలు తెలియజేసేవారు. తనలాగే తన దగ్గర చదువుకునే విద్యార్థులు పేదరికంతో చదువు ఆపకూడదని చెప్పి మానవత్వంతో ఆలోచించి తనకి వచ్చే జీవితంలోనే ఫీజులు కట్టలేని విద్యార్థులకు తానే ఫీజులు కట్టి ఆదుకునేవారు భట్టారాచార్యుల వారు.
అప్పటి పండితులు దాశరాధి కృష్ణమాచార్యులు, మరింగంటి సీతారామాచార్యులవారు పిల్లలకు సంగీతం, సాహిత్యం, నాట్యం నేర్పించేవారు. వీరు కూడా అప్పుడే సంగీత సాహిత్యాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత సంగీతంలో ఉద్దండ పండితులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వారి శిష్యులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వద్ద శిష్యరికం చేసి సంగీత సాధన చేశారు. ఆ తర్వాత ఎన్నో కర్ణాటక సంగీత కచేరీలు చేశారు. వీరు స్వతహా వేద పండితులు అవడం వల్ల మన సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిసేలా భక్తి, సంగీతం, వేదాధ్యయనం, సంస్కృతంపై పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అనేక దేవాలయాల్లో వారికి జీవన భృతిని కల్పించారు.
భట్టరాచార్యుల వారికి సాహత్యంపై ఉన్న మక్కువతో సాహితీ పూతోటను కూడా అందంగా తీర్చిదిద్దారు. సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో నిష్ణాతులు. వీరు కవితలు, కథానికలు, లలిత గీతాలు, ధారావాహికలు, అష్టాదశ ప్రవచనాలు పరిశోధనాత్మక వ్యాసాలు, అనువాద రచనలు, పద్యాలు, పాఠకులకు అందించారు. వీరికి తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్, ఉర్దూ, పర్షియన్ భాషలలో మంచి పాండిత్యం ఉంది. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి కావ్యాలను హిందిలోకి అనువదించారు. ప్రముఖ హిందీ నవలా రచయిత మోహన్ లాల్ మహత్తు వియోగి నవల ‘ఆర్యవర్త్’ ను ‘ఆర్యవర్తం’ పేరుతో తెలుగులోకి అనువదించారు. జయశంకర్ ప్రసాద్ కావ్యం ‘అంశు’ను ‘అశ్రుబిందు’గా తెలుగులోకి అనువదించారు. వీరు రాసిన ప్రముఖ గ్రంధాలు కథానాయకుడు, మన గాంధీ, శ్రీమద్ భగవద్గీతాసారం, తిరుప్పావై ప్రవచనాలు, కబీర్, వేమన తులనాత్మక అధ్యయనం, విశ్వనాథ వారి కవితా వైభవం ప్రసిద్ధి చెందినవి. వీరు ప్రముఖుల రచనలను అధ్యయనం చేసి కృష్ణప్రభ అనే పత్రికలో పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం రాశారు. యూజీసీ వారు రామానుజ వేదాంతంపై వీరితో వీడియో ఉపన్యాసాలు చేశారు. ఈ ఉపన్యాసాలు దేశవ్యాప్తంగా చక్కని గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగే దూరదర్శన్ నెట్వర్క్ లో అనేక కార్యక్రమాలు చేసి విద్యార్థులతో పాటు ఆధ్యాత్మికవేత్తలను కూడా అలరించారు.
విదేశాలనుండి పత్రికలో ఎన్నో సాహితీ, ధార్మిక వ్యాసాలు రాశారు. ఢిల్లీ నుండి వెలువడే ‘తెలుగు వాణి’లో కూడా లెక్కకు మిన్నగ వ్యాసాలు రాశారు. ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కొత్తగూడెం కేంద్రాలలో అనేక గీతాలు రాశారు. ఈ విరహ గీతం చూడండి ఎంత బాగుందో. ” సుఖము అను రాతిరి అలసిపోయినది/ కేసరములు విడివడి పోయినవి/ వికసించిన స్నేహ సరోజము/ మానసమునే ఎండిపోయినది/”. దీనిని ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో చదివి వినిపించారు.
“దేశ సేవ కంటే దేవతార్చన లేదు” అన్న చందాన స్వాతంత్ర సమరయోధులు భట్టరాచార్యుల వారు ప్రకాశం పంతులు వంటి ఉద్దండ పండితుల సాహచర్యంతో ఆచార్య వినోబా భావే నేతృత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సేవలు అందించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తు ప్రాణ త్యాగం చేశారు. అప్పుడు యువకుడిగా ఉన్న భట్టరాచార్యులవారు తల్లడిల్లి పోయి హుటాహుటిన మద్రాసు వెళ్లి ప్రకాశం పంతులుగారి పిలుపుని అందుకుని తెలుగు వారందరినీ ఒక్క త్రాటి మీదకు తెచ్చి నిరసనలో పాల్గొనేలా ఘాటు ప్రసంగాలు చేసి ఆంధ్ర రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న దేశసేవ పరాయణులు.
భట్టరాచార్యుల వారు వందకు పైగా పురస్కారాలను సొంతం చేసుకుని ఆ పరిష్కారాలకే వన్నె తెచ్చారు. ఈ ఆరడుగుల ఆజానుభాహుడు, అందరిని ఆకర్షించే ముఖవర్చస్సు, బహుముఖ ప్రతిభాశాలి, సాహితీ పిపాసి, ఉన్నత వ్యక్తిత్వం, బంగారానికి తావి అబ్బినట్లుగా ఉండే వీరిలోని అపారమైన జ్ఞాన సంపదతో అందరి మదిని దోచుకున్న మరింగంటి భట్టరా చార్యులవారు 2012 జూలై 18న భువి నుండి దివికి చేరారు. వీరికి ఘన నివాళి.
– పింగళి భాగ్యలక్ష్మి
గుంటూరు కాలమిస్టు రచయిత్రి(ఫ్రీ లాన్స్ జర్నలిస్టు,)
ఫోన్ నెంబర్.9704725609