చిత్తు కాయితాలు!

చిత్తు కాయితాలు!ఆకాశానికి సవాలు విసిరే
హరిత ఆరోహణ క్రమాలు!
వందల వసంతాలు వర్ధిల్లి
అపురూప బంధమై నిలిచిన
అమేయ బృంద గానాలు!!

దుర్మార్గుల దృష్టిపడి
అరక్షణంలో అవి
ఆక్రందనతో నేలవాలు!!
అటవీ వనరుల అక్రమరవాణా
నగరాలపై చేసే అసుర అశ చేవ్రాలు!

గుండెకాయను దొంగిలించి
ఊపిరితిత్తుల ఉసురు తీసి!
రక్త ప్రసరణ వ్యవస్థను రిక్తపరచి
భూమాత నొసటన చేసిన
పచ్చినెత్తుటి పరశు గాయాలు!!

అడవిలో పుట్టి
అడవిలోనే పెరిగి
అనుక్షణం అడవితో
పెనవేసుకున్న పేగుబంధాలు!

తరతరాల నెనరు పాదులు మృగ్యమై
పరంపరాగత ఉపాధులు కోల్పోయి
పొరకలు నరికి! పోడులు కొట్టి
పొట్టపోసుకునే అనాథ అన్నార్తులు!

బస్తరులో బహిష్క్రితులై!
భద్రాచలానికి దారులు వెదుకుతూ
తీరం దాటిన తుఫానులా
గుడారాలు వేసుకున్న గూడేలు!!

కందకాలు కొట్టించి
సరిహద్దులు చెక్కించి
పంటలను తొక్కించి
నోటికాడి కూడు లాగేసి…!

తవ్వుకున్న తాగునీటి బావులను
తమచేతే పూడ్పించి!
పశువుల మందలను
బలవంతంగా తరలించి
ఆదీ అంతం లేని
విరాట పర్వాలను సృష్టిస్తూ…!

స్వేచ్ఛా గమన గమ్యాల్ని
అప్పనంగా హరించి!
అపరిమిత చట్టాలకు
అధికారాలకు కట్టుబడే
అసమాన సమాజ చట్రంలో!
ఇరికించబడ్డ చెత్త కాయితాలు
గుత్తి కోయల జీవితాలు!!
– కరిపె రాజ్‌ కుమార్‌, 8125144729