తెలంగాణలోనూ పరిష్కారం కాని భూసమస్య

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
– గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళి
– మఖ్దూంభవన్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
– హామీల అమలుకు ఉద్యమం : చాడ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ఆవిర్భవించినా భూ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. భూస్వాములకే తిరిగి చట్టబద్ధంగా భూములను అప్పగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో మఖ్దూంభవన్‌లో శుక్రవారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి ఆ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ కేంద్ర హోంమంత్రిని కలవగానే శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిపోయారని, అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ వస్తుందని, ఇదంతా క్విడ్‌ ప్రోకో మాదిరిగా జరిగిందన్నారు. ఎమ్మెల్సీ కవితను ఇరికించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్‌ను వాడుకుంటుందని విమర్శించారు.
తెలంగాణలో దళితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దళిత బంధు పేరుతో ఇస్తున్న రూ.10 లక్షల్లో కేవలం రూ.మూడు, నాలుగు లక్షలు మాత్రమే వారికి అందుతున్నాయని చెప్పారు. పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోతే ప్రతిపక్షాలు ప్రశ్నించాయని, ఇక్కడ సచివాలయం ప్రారంభానికి తనను కూడా ఆహ్వానించలేదంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారని, గవర్నర్‌ను కేంద్రం నియమిస్తుందని అన్నారు. ఆహ్వానించలేదంటూ గవర్నర్‌ అక్షేపించడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రపతిగా ఉన్న ఆదివాసీ మహిళను పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణలో అనేక వనరులున్నాయని, అయినా నిరుద్యోగులు ఎందుకు అలమటిస్తున్నారని ప్రశ్నించారు. దీని కోసమా తెలంగాణ సాధించుకున్నదని ఆయన ప్రశ్నించారు. అమరవీరుల ప్రాణత్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, స్వాముల చుట్టూ తిరిగితే రాలేదన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష పార్టీల బలోపేతం కావాల్సిన అవసరముందని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కొన్ని రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కృష్ణా జలాల వాటా ఇంత వరకు తేల్చలేదన్నారు. ధరణి పోర్టల్‌ పూర్తిగా దరిద్రపు పోర్టల్‌ అని విమర్శించారు. ఎనిమిది లక్షల మంది రైతులు బజారున పడి తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం విభజన హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, విఎస్‌ బోస్‌, పశ్య పద్మ, ప్రజా నాట్యమండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శ్రీనివాస్‌, పల్లె నర్సింహ్మా, ఏఐటీయూసీ నాయకులు పి ప్రేమ్‌ పావని, బి వెంకటేశం, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ ఛాయాదేవి, నాయకులు ఆది రెడ్డి, స్టాలిన్‌, కమతం యాదగరి, శేఖర్‌ రెడ్డి, చంద్రమోహన్‌ గౌడ్‌, పడాల నళిని, నెర్లేకంటి శ్రీకంత్‌, ఏఐవైఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీ ఉల్లాఖాద్రీ, కె ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.