శతకోటి దండాలే… నీకు

Shatakoti Dandale... to youజైలుగోడల్ని పల్కగ జేస్కొని
అచ్చారాలకు పౌరుషంతో నింపి
బొగ్గుతున్కను నిప్కగా జేశి
ముసలినక్క నిజామును ఎలగొట్టనీకే
బందుకుల గోలీలసుంటి మాట్లతోటి
‘అగ్నిధార’ కుర్షే టట్ల చేషి
నిద్రావొయిన లోకంను మేల్కజేస్తివి

రజాకార్లు చేష్ణ పన్లతోటి తిప్పలువడి
పుండులెక్కయిన మనసులకు
రందిడ్షి నిమ్మలంగుండాలనే ఆశతోని
‘రావమ్మా శాంతమ్మ’ కవిత తోని
జవాను లెక్క ‘తిమిరంతో సమరం’ చేశ్నవు

నీ కలంల అమతమనే ఇంకు వోషి
భావకవిత్వమంటే ఏందో జెప్పి
సాయిత్యంకు ‘అమతాభిషేకం’ జేస్తివి

సదువుల తల్లి ముద్దుల కొడుకువై
పోరుబాటల ముందుకుర్కి
‘మహాబోధి’ తోటి భాధ్యత దెల్పి
‘జ్వాలా లేఖిని’ తోటి …
ప్రజల్ల అగ్గిని రాజేస్తివి

మాకొరకు గింత చేశ్న నీ కష్టం
బూడిది ల వోష్ణ పన్నేరులెక్క గావట్టే
నువ్వు రాశ్న వొయ్యిలు సద్వి
అందుట్లున్న ఇగురం తెల్సుకుని
అన్యాయంను ఎదిరిస్తే గప్పుడు
దాశరథన్న నువ్వన్నట్లె నివొద్దెనే
తెలంగాణ కోటి రత్నాల వీణయితది
– కొండాపురం లక్ష్మి