బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణే బెటర్‌… మంత్రి హరీశ్‌ రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రభాగంలో ఉందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న ఆయన, ఢిల్లీలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల వరుస సమావేశాలపై కామెంట్లు చేశారు. తెలంగాణ తరహా పథకాలను దేశవ్యాప్తంగా కావాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
మహారాష్ట్ర పోలీసులు తమ కూ తెలంగాణ పోలీసులకిస్తున్న ఇన్సెంటివ్‌లు కావాలని ఆశిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీల ప్రయత్నం రాష్ట్రంలో రెండో స్థానం కోసమేనని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ ఉన్నంత కాలం ఆయన నాయకత్వానికే ప్రజలు ఓటేస్తారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు మంత్రి పదవులను మార్చినా, అధ్యక్షులు మార్చినా, నాయకుల ను బుజ్జగించినా ప్రజల ఆలోచనల్లో మార్పు రాదని ధీమా వ్యక్తం చేశారు. గత తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో కర్ఫ్యూలు, అల్లర్లు, అసెంబ్లీ ముందు నీళ్ల కోసం ఖాళీ కుండల ప్రదర్శనలు, కరెంటు కోసం కందెనల ప్రదర్శన లు లేవని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఎరువులు దొరక్క ఎనిమిది మంది రైతులు చనిపోయారని గుర్తుచేశారు.
భౌగోళికంగా, జనాభాపరంగా పెద్ద రాష్ట్రాలు తెలంగాణను బియ్యం అమ్మాలంటూ కోరుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటన తర్వాత ఉలిక్కిపడిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో ఏ రంగంలో గుణాత్మక మార్పు వచ్చిందో చెప్పగలరా? అంటూ హరీశ్‌ రావు ప్రశ్నించారు.