‘అధికారులకు జరిమానా’

నవతెలంగాణ-హైదరాబాద్‌
కోర్టు ధిక్కార కేసులో పలువురు అధికారులకు హైకోర్టు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఆమొత్తం చెల్లించకపోతే నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని గురువారం తీర్పు చెప్పింది. ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిట్టల్‌, వాకాటి కరుణ, కాలేజీ ఎడ్యుకేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ యాదగిరి, కుల్వకుర్తి మోడల్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ స్వర్ణలతకు శిక్ష విధించింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్న కె.శ్రీనివాసరావు తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన తర్వాత కూడా విధుల్లోకి తీసుకోకుండా తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం కోర్టు ధిక్కరణగా పరిగణించింది. ఈ మేరకు పిటిషనర్‌ శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు చెప్పింది.
తీసుకున్న చర్యలు చెప్పండి
డిండి ప్రాజెక్టు నుంచి ఇసుకను అక్రమ తరలింపులపై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు ఇచ్చి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ డివిజన్‌బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు లేవంటూ అఖిల భారత్‌ హిందు మహా సభ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాస్‌ వేసిన పిల్‌ను గురువారం విచారించింది.
మరుగుదొడ్లు లేవా
హైదరాబాద్‌ నగరంలోని నౌబత్‌ పహాడ్‌ ప్రాంతంలో మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. రాత్రిళ్లు మహిళలు బహిర్భూమికి వెళ్లాల్సివస్తోందంటూ పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారించింది. మున్సిపల్‌ శాఖ, పట్టణాభివృద్ధి, జీహెచ్‌ఎంసీలకు నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.