ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టొద్దు..

– బీజేపీ రాజకీయ క్రీడలు మానుకోవాలి
– యూసీసీని తిరస్కరించండి : జస్టిస్‌ చంద్రకుమార్‌
– హిందూ, ముస్లింల విభజన కోసమే ఉమ్మడి పౌరస్మృతి : టీపీఎస్‌కే చర్చా వేదిక తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ అమలు అసాధ్యం అనీ, యూసీసీని ప్రజలంతా తిరస్కరించాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ పిలుపునిచ్చారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఓ రాజకీయ క్రీడగా దాన్ని ఆయన అభివర్ణించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్‌కే ఆధ్వర్యంలో ‘ ఉమ్మడి సివిల్‌కోడ్‌ ఎవరి కోసం’ అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్‌ మాట్లాడుతూ సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే యుసీసీ బిల్లు కావాలంటూ ఎవరు అడిగారని ప్రశ్నించారు. 2018లో కేంద్ర ప్రభుత్వానికి21వ లా కమిషన్‌ యుసీసీ అన్నది అవాంఛనీయమైనదనీ, అది అనవసరమని చెప్పిందని గుర్తుచేశారు. ఓట్ల కోసం దీన్ని తెరమీదకు తేవటం తగదని హితవు పలికారు. ఆవాజ్‌ ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ మాట్లాడుతూ .. ఒకే దేశం ఒకే చట్టం ఉండడం వల్ల మనుషుల్లో సమానత్వం, పరస్పర సాన్నిహిత్యం, జాతి సమైక్యత ఏర్పడతాయంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సూక్తులు చెబుతున్నాయని విమర్శించారు. వినటానికి వినసొంపుగా ఉన్నా.. మాటలు మాత్రం మత ఆధారంగా, నిత్యం హిందూ ముస్లిం విద్వేష రాజకీయాలు నడిపేందుకేనని విమర్శించారు. టీపీఎస్‌కే కన్వీనర్‌ జి రాములు మాట్లాడుతూ ఇది పక్కా ముస్లిం వ్యతిరేక చట్టమేనని తెలిపారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. మానవ వికాస వేదిక బి.సాంబశివరావు, కవి, రచయిత ఇంద్రవెల్లి రమేష్‌, జనవిజ్ఞాన వేదిక కృష్ణమోహన్‌, అరసం కార్యదర్శి బి సుదర్శన్‌, ఆవాజ్‌ అధ్యక్షులు సత్తార్‌, ప్రముఖ భాషా పండితులు మోత్కూరి నరహరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను చర్చా వేదిక ఏకగ్రీవంగా వ్యతిరేకించింది లా కమిషన్‌కు మూడు నెలల సమయం ఇవ్వాలనీ, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో దీన్న వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమానికి టీపీఎస్‌కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.