ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో బరువు పెరిగిపోవడం ఒకటి. దీనికి ఎన్నోరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అన్నింటి కంటే ప్రధాన కారణం మాత్రం హార్మోన్ల అసమతౌల్యత. సాధారణం గా ఇబ్బంది ఎదురవనంతకాలం చాలా మంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. కానీ ఓసారి ఇబ్బంది ఎదురయ్యాక దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయమే పడుతుంది. అందుకే సమస్య మొదట్లో ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవడం మంచిది. హార్మోన్ సమస్య ఏర్పడితే ఎదురయ్యే పరిణామాలు.. నివారణలు ఏంటో చూద్దాం…
బరువు : హార్మోన్ల అసమతౌల్యత బరువు పెరిగేలా చేస్తుంది. తిరిగి తగ్గడానికి చాలా కష్టమవుతుంది కూడా. అయితే ఇది కేవలం రెండు రకాల హార్మోన్ల వల్లే ఎదురవుతుంది. శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలవుతాయన్న సంగతి చాలామందికి తెలిసిందే. రుతుక్రమం సరిగ్గా కొనసాగేందుకు ఇవి తోడ్పడతాయి. అయితే ఈ రెండు హార్మోన్లు సరైన మోతాదులో విడుదలవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో ఏ ఒకటి ఎక్కువగా విడుదలైనా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామందిలో ప్రొజెస్టిరాన్ తక్కువగా విడుదలవుతూ ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగు తుంటాయి. దీనివల్ల బరువు అపరిమితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు జుట్టు రాలిపోవడం, రుతుచక్రం క్రమం తప్పడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎక్కువవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాదు.. డిప్రెషన్, ఎక్కువగా ఆందోళన చెందడం, నిద్రలేమి వంటివి ఎదురవుతాయి. ఈ సమస్యలు ఒత్తిడిని పెంచి ఎక్కువగా తినాలనే కోరికను పెంచుతాయి. దీంతో పాటు ఈస్ట్రోజన్ తినే ఆహారంలో ఎక్కువ భాగాన్ని శరీరంపై కొవ్వు పొరలాగా పరుచుకునేలా చేస్తుంది. ఇలా కొవ్వు పెరగడం వల్ల మరింత ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఈ విషవలయం కొన సాగుతూనే ఉంటుంది.
కారణాలు : శారీరక శ్రమ లేక పోవడం, సరైన ఆహారం తీసుకోక పోవడం, రుతుస్రావంలో తేడాలు, కుటుంబ నియంత్రణ మందులు వాడడం, సింథటిక్ ప్రొజెస్టిరాన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ప్రొజెస్టి రాన్ తక్కువగా విడుదల కావడం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి.
నివారణ : తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. కనీసం ఓ అరగంటపాటు నడవడం అయినా అలవాటు చేసుకో వాలి. ఫాస్ట్‌ఫుడ్ తినడం తగ్గిం చాలి. రోజూ తీసుకోవాల్సిన మోతా దులో పోషకాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత మేరకు ఆర్గానిక్ ఫుడ్, అదీ జన్యు మార్పులు చెందని ఆహారం తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా కుటుంబ నియంత్రణ మందులు వాడుతుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.