ఈ రోజుల్లో ప్రతీ వస్తువు కల్తీమయమే. ఏది అసలో.. ఏది నకలో… తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కల్తీ సరుకులే వాడడం వల్ల అప్పటికి ఏ సమస్యా ఏర్పడకపోవచ్చు కానీ భవిష్యత్‌లో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురు కావొచ్చు. కాబట్టి కొనేటపుడే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మరి కొన్ని కల్తీ వస్తువులను ఏ విధంగా పసిగట్టొచ్చో చూద్దామా….
సాధారణంగా పసుపు లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రంగు కంటే కాస్త ఘాఢంగా ఉంటే అది కల్తీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రసాయనాలు కలిపి తయారు చేసిన పసుపును వంటల్లో వాడితే మనం రోగాలకు స్వాగతం పలికినట్లే. ఒక గ్లాస్ నీటిలో పసుపు వేసి చూస్తే… స్వచ్ఛమైన పసుపు అయితే కొద్దిగా రంగును విడుదల చేస్తూ అడుగుకు చేరుకుంటుంది. అదే కల్తీ అయితే కలపకుండానే నీరు మొత్తం పసుపు రంగుకు మారిపోతుంది.
ధనియాల పొడిలో గడ్డి గింజల పొడి కలుపుతారు. లేదా ఎండబెట్టిన పేడను కలుపుతారు. ఈ కల్తీని తెలుసుకునేందుకు ధనియాల పొడి వాసన చూడాలి. చక్కటి ధనియాల పొడి వాసన రాకపోతే అందులో కల్తీ జరిగిందన్నమాటే.
నిత్యం వాడే వంటల్లో కారం చాలా ముఖ్యమైంది. ఇందులో పలు రసాయనాలతో పాటు రంపపు పొట్టు, ఇటుక పొడి వంటివి కలుపుతున్నారు. దీనిని గుర్తించేందుకు ఓ గ్లాస్‌లో నీళ్లు పోసి అందులో కారం వేయాలి. కారం నీళ్లపై తేలియాడితే.. అందులో రంపపు పొట్టు ఉన్నట్లు లెక్క. ఒకవేళ నీరు ఎరుపు రంగులోకి మారితే కెమికల్ కలిసిందని చెప్పచ్చు. అదే స్వచ్ఛమైన కారం కొద్దిగా రంగును విడుదల చేసి నీటి అడుగున ఉండి పోతుంది. ఇటుకపొడి ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకోవాలంటే.. కారాన్ని చేతి వేళ్లతో తీసి కాస్త నలపాలి. ఇసుక మాదిరిగా అనిపిస్తే.. కారంలో ఇటుక పొడి కలిసిందని చెప్పచ్చు.
ఆవాల్లో కల్తీని కనుక్కోవాలంటే ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో ఆవాలు వేయాలి. బ్రహ్మ జెముడు విత్తనాలు నీటిలో తేలతాయి. ఆవాలు అడుగున చేరుకుంటాయి.
మిరియాల్లో కల్తీని గుర్తించేందుకు గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో వేయాలి. బొప్పాయి గింజలయితే నీటిపై తేలతాయి. మిరియాలయితే అడుగుకు చేరుకుంటాయి.
ఇంగువ పొడిలో చాక్‌పీస్ పొడి కలుపుతారు. దీన్ని గుర్తించేందుకు కాస్త యాసిడ్‌ను దానిలో కలిపాలి. పొగలు వస్తే కల్తీ జరిగినట్లు.. రాకపోతే స్వచ్ఛమైనది అన్నట్లు లెక్క.