– మేరీ మాటి మేరా దేశ్ ప్రచారం..మన్ కీ బాత్‌లో ప్రధాని
– మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు ‘మేరీ మాటి మేరా దేశ్’ పేరుతో ప్రచారం చేయనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ 103 ఎపిసోడ్‌లో మాట్లాడారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తామన్నారు. దాంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నామన్నారు. అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభంవించిన వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడిన తీరును ప్రధాని అభినందించారు. తన పర్యటన సందర్భంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100కు పైగా కళాఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చిందని చెప్పారు. 2016, 2021లో తన అమెరికా పర్యటన సందర్భంగా కూడా అమెరికా కొన్ని కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చినట్టు తెలిపారు. సుమారు రూ.12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను భారత్ నాశనం చేసి రికార్డు సృష్టించిందని అన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దేశ యువత సమష్టిగా చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు. వర్షాలొచ్చే ఈ సమయమే ‘చెట్ల పెంపకం, నీటి సంరక్షణ’లు ప్రధానమైనవని, దేశ ప్రజలు పూర్తి చైతన్యంతో, బాధ్యతతో ‘జల సంరక్షణ’ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే ప్రధాని తన మన్ కీ బాత్ ప్రసంగంలో దాదాపు 90 రోజులుగా కాలిపోతున్న, అనిశ్చితి నెలకొన్న మణిపూర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కొసమెరుపు.