దరిపెల్లి స్వరూపా… సముద్రం చూడటానికి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాని నిరంతరం అనేక అలలతో ఆటుపోట్లు జరుగుతూనే ఉంటాయి. అదే విధంగా ప్రతి మహిళ జీవితం పైకి ప్రశాంతంగా కనిపిస్తుంది. లోపల అనేక సంఘర్షణలు, సమస్యలు, బాధ్యతల మధ్యన తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలాంటి జీవితాలు అనుభవిస్తున్న సంఘర్షణలను అక్షరీకరించడం ఆమె ప్రత్యేకం. ‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది’ అన్న కాళోజీ మాటలు నిరంతరం ఆమెకు స్ఫూర్తి. ‘స్త్రీవాద కవిత్వాన్ని మరింత బలపరచాలి. విరివిగా మహిళలు సాహిత్య రంగంలోకి అడుగు పెట్టాలి’ అంటున్న ఆమె సాహిత్య పరిచయం నేటి మానవిలో…
మాది కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మామిడాల పల్లి గ్రామం. అమ్మ దరిపెల్లి రాజమ్మ, నాన్న గౌరయ్య. వ్యవసాయం చేస్తూ, రోజువారి కూలీగా పనిచేసేవాడు. అనేక ఆటుపోట్లు మధ్య 1980లో మా నాన్నకు సింగరేణి ఉద్యోగం రావడంతో మేమంతా మంచిర్యాలలోని సింగరేణి ప్రాంతమైన శ్రీరాంపూర్ కృష్ణ కాలనీకి వెళ్ళాం. మా బాల్యమంతా అక్కడే గడిచింది. నాకు అన్నయ్య శ్రీనివాస్, తమ్ముడు సంతోష్ కుమార్ ఉన్నారు. ఒక్కగాని ఒక ఆడపిల్లనని అల్లరు ముద్దుగా పెంచారు. మా నాన్నగారు శ్రీరాంపూర్‌లోని ఆర్. కె -6 మైన్‌లో పనిచేసేవారు.
అనేక కష్టాలు అనుభవించాము
1993లో మా అన్నయ్య శ్రీనివాస్‌కి యాక్సిడెంట్ జరిగింది. దీంతో మా జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అమ్మ అన్నయ్యను చూసుకుంటూ ఆసుపత్రికి పరిమితమయ్యింది. నాన్న ఉద్యోగం చేస్తూ మమ్మల్ని చూసుకునేవాడు. దాదాపు 5 ఏండ్లు అనేక కష్టాలు అనుభవించాం. నాన్నంటే నాకు ప్రాణం. ఇక నాకున్న ఈ ప్రాణమే మా అమ్మ. త్యాగానికి మారుపేరు మా అమ్మ. నాన్న సింగరేణి ఉద్యోగం కాబట్టి ఆ పాఠశాలలోనే మేము పదో తరగతి వరకు చదువుకున్నాం. సింగరేణి మహిళా జూనియర్ కాలేజ్ కొత్తగూడెంలో ఇంటర్ పూర్తి చేశాను. వెంటనే అన్‌ట్రైన్డ్ డీఎస్సీ 2002 నోటిఫికేషన్ పడితే ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఆ ఉద్యోగానికి పరీక్షలు రాశాను. రిజల్ట్ రావడం, క్వాలిఫై అవ్వటం వెంటనే జాబ్‌లో జాయిన్ అవ్వటం చకచక జరిగిపోయాయి. ఇలా 18 ఏండ్ల వయసులోనే గవర్నమెంట్ జాబ్‌ను సాధించగలిగాను.
ఆత్మవిశ్వాసాన్ని నింపింది
మొదటిసారి ఇంటర్‌లో ఉన్నప్పుడు కవిత్వం రాశాను. పాఠశాలలో చదువుతున్నప్పుడు కూడా చిన్నచిన్న అంశాల మీద కవిత్వం, వ్యాసాలు రాసేదాన్ని. కానీ దాని పరిధి స్కూల్ వరకే. 1999-2000లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో నేను ఇంటర్ చదువుతున్నాను. కాలేజీలో ఆగస్టు 15 సందర్భంగా వక్తృత్వ, కవిత్వ పోటీలు పెట్టారు. అప్పుడు కార్గిల్ యుద్ధంజ మీద కవిత్వం రాయమన్నారు. నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలా మంది కవితలు రాసుకొచ్చారు. అయితే మొదటి బహుమతి నాకే వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. ‘అనాటమీ డిక్షనరీ’ బహుమతిగా ఇచ్చారు. ఇప్పటికీ ఆ బహుమతి నాతోనే ఉంది. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ కవిత మా కాలేజీ సిల్వర్ జూబ్లీ బుక్‌లో ప్రింటయి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక ఇక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు.
పాఠశాలలోనే బీజాలు పడ్డాయి
నిజానికి కవిత్వం మనిషిలో జరిగే అనేక సంఘర్షణల నుంచి పుడుతుంది. నేను మొదటగా కవిత్వం రాయటానికి స్ఫూర్తి రామకృష్ణ మాస్టర్. సింగరేణి హై స్కూల్ శ్రీరాంపూర్‌లో చదువుకుంటున్నప్పుడు ఆరో తరగతి నుంచి మాకు రామకృష్ణ తెలుగు బోధించేవారు. ఆయన పదాలను పలికే విధానం, పద్యాలను పాడే శైలి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా తెలుగు భాష పట్ల మక్కువ ఎక్కువ కలిగేలా చేసింది మా మాస్టారే. ప్రతి చిన్న సందర్భం కూడా కవిత రూపంలో అల్లి మా ముందు వెంటనే చెప్పేసేవారు. వకృత్వ్తపు పోటీలు, వ్యాసరచన పోటీలలో కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. అలగే అరుణ మేడం, ఇందిరా మేడం ప్రభావం కూడా నాపైన ఎంతో ఉంది.
మనసు స్పందించినపుడల్లా
గుర్రం జాషువా కవిత్వాన్ని నేను బాగా ఇష్టపడతాను. ఏ విషయాన్నీ అయినా నిర్మోహమాటంగా చెప్పే గుణం చలం రచనల నుంచి నేర్చుకున్నాను. గోగు శ్యామల, జూపాక సుభద్ర రచనలను బాగా చదువుతాను. వర్ధమాన కవులు రాసే అంశాలను కూడా చదువుతాను. మనసు స్పందించినప్పుడల్లా కాగితంపై నా కలం కదులుతూనే ఉంటుంది. అమృతాలు దాదాపు 130 పైగా ఉన్నాయి. నా మొదటి ప్రచురణ ‘గోగు పూలు’. ఇది 2018లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వేశాను. రెండవది చైతన్య బావూట, ఇది 2022లో తెలంగాణ సారస్వత పరిషత్, సినారె ట్రస్ట్ వాళ్ళు ముద్రించారు. మూడవది తక్కెడ, ఇది 2023లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ముద్రించటానికి పరిశీలనలో ఉంది. అలాగే వివిధ వార్తాపత్రికలకు వివిధ అంశాల మీద, జాతిని జాగృతం చేసిన మహనీయుల ఆశయాల గూర్చి సందర్భానుసారంగా వ్యాసాలను రాస్తుంటాను.
సమాజ మార్పుకు…
సమాజంలో కనబడని అనేక రుగ్మతలను సునిష్టంగా పరిశీలించి నిర్భయంగా చెప్పేవాడే కవి. సాహిత్యం సామాజిక చైతన్యానికి పునాది. అంతిమంగా సమసమాజ స్థాపనకు మేలు కోరే సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. మానసిక పరివర్తన, సామాజిక సంక్షోభాల నివారణ, సామాజిక రుగ్మతలపై సమయభేరి మోగించే అవకాశం ఒక్క సాహిత్యానికి మాత్రమే ఉంది. కవి, రచయిత తనకంటూ స్పష్టమైన భావజాలాన్నీ కలిగి ఉంటే నిర్ధిష్టమైన రచనా ప్రక్రియను సృష్టించగలుగుతారు. లేకుంటే చుక్కాని లేని నావలా, సమాజ మార్పుకు దోహదపడని విద్యలా నిరుపయోగమే అవుతుంది ఆ రచన.
నన్ను బాగా కదిలించాయి
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా 20 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, భీమారం మండలం, మద్దికల్ పాఠశాలలో పనిచేస్తున్నా. ఎన్నో మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాను. సమాజం పట్ల అవగాహన పెంచుకోవడానికి ఇది ఎంతో దోహద పడింది. మారుమూల ప్రాంతాల ప్రజల జీవన విధానం నన్ను బాగా కదిలించింది. అందుకే నా రచనల్లో ఎక్కువ భాగం కార్మికులకు, కర్షకులకే చోటు. తోటి ఉపాధ్యాయులు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు.
బాధ్యతను పెంచాయి
బహుజన రైటర్స్ వెస్ట్రన్ ఇండియా కాన్ఫరెన్స్ నుంచి నేషనల్ అవార్డ్ సావిత్రిబాయి పూలే 2019 ముంబై, మండల, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు, ప్రపంచ తెలుగు మహాసభలనుంచి ఉత్తమ కవయిత్రి, తెలంగాణ ఉద్యమ పురస్కారం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం, అభిరామన్ సొసైటీ ఉత్తమ రచయిత అవార్డు, ఎఫ్.ఎల్.ఎన్.టి.ఎల్.ఎం అవార్డు, మిట్టపల్లి నర్సయ్య మెమోరియల్, సావిత్రిబాయి పూలే అవార్డ్, బాల సృజన వేదిక అవార్డు, తెలంగాణ జాగృతి అవార్డు, లేడీ లెజెండ్ అవార్డు, తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదు వారి ఉత్తమ రచయిత అవార్డులు అందుకున్నాను. ఇవన్నీ నాపై ఉన్న బాధ్యతను మరింత పెంచాయి.
అంతరాల దొంతరలు
సబ్బండ వర్గాలన్నీ సంతృప్తికరమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలన్నది నా కాంక్ష. విద్య, వైద్యం, అధికారం, సమాంతర న్యాయం పొందాలి. అంతరాల దొంతరలను తొలగించి తరతరాల చీకటిని తరిమికొట్టాలి. అందుకే నా రచనలన్నీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సులభంగా ఉంటాయి. చాలావరకు ఆర్ధ్రతతో కూడిన భావజాలమే కనిపిస్తుంది. భవిష్యత్తు ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. అది కాలం చేతిలో బందీ అయి ఉంటుంది. కానీ వర్తమానంలో మనం చేసే క్రియలను బట్టి భవిష్యత్తు ఉంటుందని మాత్రం చెప్పగలను. మనసు స్పందించినంత వరకు రచనలు చేస్తూ పోవటమే నా ముందున్న లక్ష్యం.
విలువలతో కూడిన విద్యతో…
సాహిత్యంతో పాటు విద్యారంగంలో కూడా మార్పు చాలా అవసరం. దీనికి ఉపాధ్యాయులు, రచయితలు బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సమాజంలో మార్పు సాధ్యం. ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని ముందుగా పాఠశాలలోనే విద్యార్థులు నేర్చుకుంటారు. విలువలతో కూడిన విద్యాబోధనతోనే నిచ్చెన మెట్ల సమాజం సమాంతరమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. దీనికి వెన్నుదన్నుగా కవిత్వం ఉపయోగపడుతుంది. ఉత్తమ సాహిత్యం మెరుగైన సమాజాన్ని ఆవిష్కరింపజేస్తుంది.
నిర్మొహమాటంగా చెప్పేస్తారు
పెండ్లి తర్వాత కూడా నా రచనల్లో పెద్దగా మార్పేమీ లేదు. పెండ్లికి ముందు నా ప్రతి విజయంలో నా తల్లిదండ్రులు, అన్నదమ్ముల సహకారం చాలా ఉంది. నా భర్త సుంచు లక్ష్మణ్. పెండ్లి తర్వాత ఆయన సహకారం చాలా ఉంది. ఒక మహిళ రచనలు చేయాలంటే కుటుంబ సహకారం చాలా అవసరం. ఆ సహకారం నాకు పూర్తిగా ఉంది. నేను రాసింది ముందు ఆయనకే వినిపిస్తాను. బాగోకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తారు. దాంతో నా కవిత్వానికి మరింత పదునుపెడతాను. నా కొడుకు కార్తికేయ, పాప సహస్ర. రచనలు చేసే సమయంలో నాకు కావలసిన ప్రశాంతతను నా కుటుంబం నాకు అందిస్తుంది. ఒక్కో సందర్భంలో కుటుంబాన్ని, ఉద్యోగ బాధ్యతల్ని, నా ప్రవృత్తి అయిన సాహిత్యాన్ని సమాంతరం చేయడానికి కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినప్పటికీ మూడింటిని సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నాను.
– సలీమ