ఐకేపీ వీఓఏల సమస్యల

– పరిష్కారానికి కృషి చేయండి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి వీఓఏల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం తమను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించేలా, ఇతర సమస్యల పరిష్కరించేలా కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ, రాష్ట్ర అధ్యక్షులు కె. రాజ్‌కుమార్‌, కోశాధికారి సుమలత, ఆఫీస్‌ బేరర్లు అంజి, వసియా బేగం, రాములు, దుర్గయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ్మినేని దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామన్న సెర్ప్‌ ఉన్నతాధికారులు ఇప్పుడు మాట మారుస్తున్నారని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేలా, రూ.26 వేల వేతనం ఇప్పించేలా రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తేవాలని కోరారు. గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు విఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామా సంఘానికి ల్యాప్‌ ట్యాప్‌, నెట్‌ సౌకర్యం కల్పించేలా చూడాలని విన్నవించారు. వీఓఏలకు పది లక్షల రూపాయల సాధారణ బీమా, ఐడీకార్డులు, యూనిఫాం, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, సిసీలుగా పదోన్నతులు తదితర డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌హెచ్‌జి, వీఓ లైవ్‌ మీటింగ్‌లను రద్దు చేసేలా చూడాలని కోరారు.